ఏపీలో గెలుపుతో ఎన్డీయేకు ఊపిరి

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెదేపాలతో పొత్తు భాజపాకు జాతీయ స్థాయిలో బాగా కలిసొచ్చింది. భాజపా గెలిచిన 3 లోక్‌సభ స్థానాలతోపాటు తెదేపాకు వచ్చిన 16, జనసేన నెగ్గిన 2 లోక్‌సభ సీట్లు..

Published : 05 Jun 2024 05:09 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెదేపాలతో పొత్తు భాజపాకు జాతీయ స్థాయిలో బాగా కలిసొచ్చింది. భాజపా గెలిచిన 3 లోక్‌సభ స్థానాలతోపాటు తెదేపాకు వచ్చిన 16, జనసేన నెగ్గిన 2 లోక్‌సభ సీట్లు.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నాయి. ఒంటరిగా పోటీ చేసి, 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భాజపా ఈ ఎన్నికల్లో ప్రతి అడుగూ ఆచితూచి వేసింది. ఎన్డీయే కూటమి తరఫున 10 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన భాజపా 8చోట్ల గెలుపొందింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా భాజపా తరఫున అధిక సంఖ్యలో అభ్యర్థులు శాసనసభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన భాజపా మూడు చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో 11.32%, శాసనసభ ఎన్నికల్లో 2.83% చొప్పున ఓట్లు సాధించారు.

లోక్‌సభ అభ్యర్థులకు 2 లక్షలకు పైగానే మెజారిటీ

ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా అరకు, బద్వేలు మినహా మిగిలినచోట్ల గెలుపొందారు. రాజమహేంద్రవరం, అనకాపల్లి, నరసాపురం లోక్‌సభ స్థానాల నుంచి పురందేశ్వరి, సీఎం రమేశ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపొందారు. సీఎం రమేశ్‌ 2.90 లక్షలు, భూపతిరాజు శ్రీనివాసవర్మ 2.76 లక్షలు, పురందేశ్వరి 2.39 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. రాజంపేట, అరకు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్తపల్లి గీత, వరప్రసాదరావు ఓటమిపాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని