పార్టీ మారినా ఫలితం ఇద్దరికే

ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లను పొందడం ఎంతో ప్రయాస కాగా.. కొందరికి అవి అనూహ్యంగా లభిస్తుంటాయి.

Published : 05 Jun 2024 07:04 IST

మరో పది మందికి నిరాశ

ఎన్నికల వేళ ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లను పొందడం ఎంతో ప్రయాస కాగా.. కొందరికి అవి అనూహ్యంగా లభిస్తుంటాయి. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో చివరి క్షణాల్లో ఇలా పార్టీలు మారిన ఇద్దరు అభ్యర్థులకు అదృష్టం కలిసి వచ్చింది. ఆదిలాబాద్, వరంగల్‌ స్థానాల్లో గోడం నగేష్‌, కడియం కావ్యలు అలా విజయం సాధించారు. పార్టీ మారిన మరో పది మందికి నిరాశే మిగిలింది. 

  • తొలుత తెలుగుదేశంలో మూడు దఫాలు ఎమ్మెల్యేగా, ఒక దఫా మంత్రిగా పనిచేసిన గోడం నగేష్‌ 2014 ఎన్నికలకు ముందు భారాసలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన భారాస తరఫున ఆదిలాబాద్‌ స్థానంలో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2019లోనూ మళ్లీ బరిలో దిగినా భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.  పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన భాజపాలో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్‌ ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 
  • వరంగల్‌ ఎంపీ సీటుకు తీవ్ర పోటీ ఏర్పడిన తరుణంలో భారాస అధిష్ఠానం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆమె భారాసకు రాజీనామా చేశారు. తండ్రితో కలిసి మార్చి 31న కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు కాంగ్రెస్‌ టికెట్‌ను ఇవ్వగా గెలుపొందారు. 
  • భారాస నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 
  • చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
  • జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ భారాస టికెట్‌ను కాదనుకొని కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 
  • హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భారాసను వీడి భాజపాలో చేరి నల్గొండ టికెట్‌ తెచ్చుకున్నా ఓడిపోయారు. 
  • మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి భార్య,  సునీతారెడ్డి భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి నుంచి పోటీ చేయగా ప్రజలు ఆదరించలేదు. 
  • మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భారాసను వీడి భాజపా తరఫున వరంగల్‌ నుంచి బరిలో దిగినా ఓడిపోయారు.
  • నాగర్‌కర్నూల్‌ సిటింగ్‌ ఎంపీ పోతుగంటి రాములు భారాసను వీడి కుమారుడు భరత్‌ప్రసాద్‌తో కలిసి భాజపాలో చేరారు. భరత్‌ప్రసాద్‌కు భాజపా టికెట్‌ ఇచ్చినా కలిసి రాలేదు. 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  భారాసలో చేరి నాగర్‌కర్నూల్‌లో పోటీచేసినా గెలుపు దక్కలేదు. 
  • మహబూబాబాద్‌ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ భారాస నుంచి భాజపాలో చేరి పోటీచేసినా  ఫలితం సున్నా. 
  • పార్లమెంటు ఎన్నికలకు ముందు నీలం మధు బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరగా అధిష్ఠానం మెదక్‌ టికెట్‌ ఇచ్చినా ఓటమి పాలయ్యారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని