హ్యాట్రిక్‌ విజయంతో నెహ్రూ, ఇందిర, వాజ్‌పేయీల సరసన మోదీ

హ్యాట్రిక్‌ విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమయ్యారు.

Updated : 05 Jun 2024 07:42 IST

దిల్లీ: హ్యాట్రిక్‌ విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానుల వివరాలను పరిశీలిస్తే...

1. జవహర్‌లాల్‌ నెహ్రూ (1947-1964): 16 సంవత్సరాల 286 రోజులు:

స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 1947లో జవహర్‌లాల్‌ నెహ్రూ భారత తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి మరణించేంతవరకు(1964) నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు దేశ    ప్రధానిగా సేవలందించిన నెహ్రూ ఆ పదవిలో అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. ప్రధానిగా నెహ్రూ మొత్తం నాలుగుసార్లు ప్రమాణం చేశారు. 

2. ఇందిరాగాంధీ(1966-1977, 1980-1984): 15 సంవత్సరాల 350 రోజులు:

నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి రికార్డు సృష్టించారు. నాలుగు పర్యాయాలు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె మొత్తం 15 సంవత్సరాల 350 రోజులు పదవిలో ఉన్నారు. 

3. నరేంద్ర మోదీ
10 సంవత్సరాల తొమ్మిది రోజులు:

2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 10 సంవత్సరాల 9 రోజులు ప్రధానిగా సేవలందించిన నేతగా మోదీ నిలిచారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగానూ మోదీ రికార్డు సృష్టించారు. అదే విధంగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న రెండో కాంగ్రెసేతర నేత కూడా మోదీనే.

4. మన్మోహన్‌ సింగ్‌(2004-2014):  10 సంవత్సరాల నాలుగు రోజులు

మన్మోహన్‌సింగ్‌ మొత్తం 10 సంవత్సరాల నాలుగు రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్‌ ఓటమి అనంతరం ఆ పదవి నుంచి నిష్క్రమించారు. మొత్తం రెండు పర్యాయాలు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 

5. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (1996, 1998-2004): ఆరు సంవత్సరాల 80 రోజులు

అత్యధిక కాలం పనిచేసిన అయిదో ప్రధానిగా, కాంగ్రెసేతర నేతల్లో రెండో ప్రధానిగా వాజ్‌పేయీ నిలిచారు. మొత్తం ఆరు సంవత్సరాల 80 రోజులు ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయీ.. నెహ్రూ, ఇందిరల తర్వాత మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన నేతగానూ గుర్తింపు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు