కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తు లోక్‌సభ ఎన్నికల వరకే.. గోపాల్‌ రాయ్‌

కాంగ్రెస్‌తో ఆప్‌ పొత్తు లోక్‌సభ ఎన్నికల వరకేనని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి పోరుకే అవకాశం ఉందని ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ అన్నారు

Published : 06 Jun 2024 21:27 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీతో తమ పొత్తు లోక్‌సభ ఎన్నికల వరకేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని ఆప్‌ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ అన్నారు. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. తమ పార్టీ పూర్తి మద్దతు ఇండియా కూటమికేనని స్పష్టం చేశారు. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే పోటీ చేసిందని.. ఇందులో పలు పార్టీలు కలిసి పోరాడగా.. అందులో ఆప్‌ కూడా ఒకటి అన్నారు. ఇప్పటివరకైతే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొత్తూ లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. 

కమలదళానికి నష్టం అనుకున్న దానికంటే ఎక్కువా..?

‘ప్రతికూల పరిస్థితుల్లోనే ఈ ఎన్నికల్లో పోరాడాం. మా నాయకత్వం జైలులో ఉంది. దిల్లీలోని ఏడు స్థానాల్లో గెలుపొందిన భాజపా అభ్యర్థుల మెజార్టీ తగ్గింది. కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఆప్‌ కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం పార్టీ ఐక్యంగా పోరాటం చేశాం. కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తు వల్ల భాజపా అభ్యర్థుల మెజార్టీ తగ్గింది. జూన్‌ 8న కౌన్సిలర్లతో, 13న పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం’ అని గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని