సంక్షిప్త వార్తలు (5)

ప్రధానమంత్రి మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 10 Jun 2024 06:20 IST

ప్రధానికి చంద్రబాబు అభినందనలు

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారు. నరేంద్రమోదీ లక్ష్యమైన వికసిత్‌ భారత్‌ సాధన దిశగా ఈ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారికీ అభినందనలు చెప్పారు. దేశ వృద్ధి, అభివృద్ధి, సౌభాగ్యంలో కొత్త శకానికి ఈ ప్రమాణ స్వీకార వేడుక ఆరంభమని ఆదివారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. 


11న ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం 

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం (11వ తేదీన) ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెదేపా వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి.


ప్రధాని మోదీకి జగన్‌ శుభాకాంక్షలు 

ఈనాడు, అమరావతి: ‘ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు.


చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన నవీన్‌ పట్నాయక్‌ 

భువనేశ్వర్‌: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడుకు ఆదివారం ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపా. నా రాజకీయ ప్రయాణంలో ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉంది. బాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. 


వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన వీసీలు రాజీనామా చేయాలి
మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ 

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్‌ లాంటి వాళ్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయాల్ని రాజకీయాలకు అడ్డాగా మార్చిన వీరికి వీసీలుగా కొనసాగే నైతిక అర్హత లేదని ఆదివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు విశ్వవిద్యాలయాల్ని వైకాపా కార్యాలయాల్లా మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ అవినీతిపై విచారణ చేయిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని