తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో గల్లీలో పనిచేసిన ముగ్గురు కార్యకర్తలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత భాజపాకు మాత్రమే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 10 Jun 2024 06:44 IST

ఈనాడు, దిల్లీ: రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో గల్లీలో పనిచేసిన ముగ్గురు కార్యకర్తలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత భాజపాకు మాత్రమే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ రెండో ప్రభుత్వంలో పనిచేసిన ఆయన ఇప్పుడు మూడో ప్రభుత్వంలోనూ క్యాబినెట్‌ మంత్రిగా ఆదివారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపాలో పనిచేసిన వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరికి మంత్రిపదవులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు పార్టీ మంత్రి పదవులు కట్టబెట్టింది. గల్లీలో పనిచేసిన కార్యకర్తలను దిల్లీలో మంత్రులుగా చేసిన చరిత్ర భాజపాకు తప్ప దేశంలో మరే రాజకీయపార్టీకి లేదు. మాకెవ్వరికీ రాజకీయ వారసత్వం లేదు. పెద్దనాయకులెవ్వరితోనూ బంధుత్వంలేదు. అయినా సిద్ధాంతమే మాకు ఊపిరి. పార్టీ కార్యకర్తలే కుటుంబం అని మమ్మల్ని ఎంపిక చేశారు. గత పదేళ్లు ఎలా పనిచేశామో వచ్చే 5 ఏళ్లు అలాగే పనిచేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా అమలుచేస్తాం. తెలుగురాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం. పార్టీ కార్యకర్తలు మరింత పట్టుదలతో భాజపాను దక్షిణాదిలో విస్తరించేందుకు ముందుండాలని పిలుపునిస్తున్నా. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భాజపాను అధికారంలోకి తేవడానికి అందరూ పనిచేయాలి. నాకు ఇంతటి విజయాన్ని చేకూర్చిపెట్టిన సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని