Tamilisai: ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్‌

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక (23) ఆత్మహత్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated : 14 Oct 2023 13:23 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక (23) ఆత్మహత్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, లోనవుతున్న ఒత్తిళ్లను ప్రవళిక మరణం మరోసారి గుర్తు చేస్తోందని గవర్నర్‌ తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశకు లోను కావద్దని, ఉపాధి వేటలో ధైర్యంగా ముందుకెళ్లాలని కోరారు. యువతకు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఉద్యోగ లక్ష్య సాధనలో వారికి పూర్తి అండగా నిలుస్తానన్నారు.

ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే: రాహుల్‌

ప్రవళిక ఆత్మహత్య ఘటన చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తేనే జాబ్‌ క్యాలెండర్‌ వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలోనే టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య

వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా... అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్‌లోనే ఉంది. రాత్రి 1.30 ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎట్టకేలకు ప్రవళిక స్వగ్రామానికి మృతదేహాన్ని ఇవాళ తరలించారు. ప్రవళిక మృతితో బిక్కాజిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని