Simultaneous polls: ఈ సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలతో చర్చించాల్సింది : అశోక్‌ గహ్లోత్

జమిలి ఎన్నికలపై (Simultaneous polls) అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా కమిటీని నియమించడం సరికాదని రాజస్థాన్‌ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ (Ashok Gehlot) అన్నారు.

Published : 04 Sep 2023 02:10 IST

జైపుర్ : జమిలి ఎన్నికల (Simultaneous polls) సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించే ముందే విపక్ష పార్టీలతో చర్చించాల్సిందని రాజస్థాన్‌ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ (Ashok Gehlot) అభిప్రాయపడ్డారు. పారదర్శక విధానాన్ని అనుసరించకపోవడం వల్లే ప్రస్తుతం దేశ ప్రజల్లో జమిలి ఎన్నికలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ‘ఇది సంచలన నిర్ణయం. మీరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి చర్చలు జరపాల్సింది. అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది. అప్పుడు కమిటీని ఏర్పాటు చేసి ఉంటే.. ప్రజలు నమ్మేవారు. అలా కాకుండా మీరే నేరుగా కమిటీని ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీరు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నారా?.. లేదా?’ అని గహ్లోత్ ప్రశ్నించారు. 

జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరేదేమిటి?: కేజ్రీవాల్‌

ఎన్డీయే ప్రభుత్వం భారత దేశ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తోందని గహ్లోత్‌ విమర్శించారు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది కాబట్టే సద్విమర్శలు వస్తే.. వాటిని స్వీకరించి సంస్కరణలు చేపడుతున్నానని చెప్పారు. అలా చేయడం వల్ల అంతిమంగా ప్రజలకే మేలు చేకూరుతుందన్నారు. కానీ, భాజపాను ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారని గహ్లోత్‌ ఆరోపించారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారనే కారణంతో భాజపా వందల మందిని జైలుకు పంపించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యమనే ముసుగు ధరించి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని