Simultaneous polls: జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరేదేమిటి?: కేజ్రీవాల్‌

Simultaneous polls జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరే ప్రయోజనమేంటని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

Updated : 03 Sep 2023 16:18 IST

చండీగఢ్‌: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికల (Simultaneous Polls)అంశంపై కేంద్రం జోరుగా పావులు కదుపుతోంది. ఈ విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని సైతం నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తోన్న ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ కాన్సెప్ట్‌ హేతుబద్ధతపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  జమిలి ఎన్నికలతో సామాన్యులకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేంటని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) అన్నారు.  ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలా? లేదంటే ఒకే దేశం- అందరికీ ఒకే రకమైన విద్య, వైద్యమా (ధనిక, పేదలందరికీ సమానంగా నాణ్యమైన చదువు).  అసలు జమిలి ఎన్నికలతో సామాన్యుడికి కలిగే మేలు ఏంటి?’’ అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నలు సంధించారు. 

ఆదివారం హరియాణాలోని భివానీలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి పర్యటించనున్న వేళ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఉచితాలను అందించడం కంటే స్వావలంబన కల్పించేందుకే భాజపా కట్టుబడి ఉందంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు.  దిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌ సర్కార్‌ ఉచితంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తోందన్నారు. ‘‘ఖట్టర్‌ సాబ్‌.. మేం ప్రపంచ స్థాయి ఉచిత విద్య, వైద్యాన్ని దిల్లీలో అమలు చేస్తున్నాం. 24గంటల పాటు ఉచితంగా విద్యుత్‌, తాగునీరు అందిస్తున్నాం. ఇదే పనిని పంజాబ్‌లోనూ మొదలుపెట్టాం. ఈ సౌకర్యాలు కల్పించడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే హరియాణా ప్రజలు సైతం పొందబోతున్నారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు