Lok sabha Elections: తొలి విడత పోలింగ్‌.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!

Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

Updated : 19 Apr 2024 14:11 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలివిడత పోలింగ్ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో కాల్పులు వినిపించాయి. దానికి సంబంధించి వీడియో క్లిప్‌ ఒకటి వైరల్‌గా మారింది.  ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇన్నర్‌ మణిపుర్‌, ఔటర్‌ మణిపుర్.. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో అక్కడ భాజపా మిత్రపక్షాలే విజయం సాధించాయి. కాగా..గత ఏడాది జాతుల మధ్య వైరంతో మణిపుర్ అట్టుడికింది. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వం అక్కడ భారీగా బలగాలను మోహరించింది. (Lok sabha Elections)

కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

పశ్చిమ్‌ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓ బూత్‌ నుంచి తమ ఏజెంట్‌ బిశ్వంత్ పాల్‌ను టీఎంసీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని కమలం పార్టీ ఆరోపించింది. మేదినీపుర్ నియోజకవర్గంలో రాళ్లదాడులు చోటు చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కూచ్‌బెహర్‌లో జరిగిన ఘటనల్లో ఇరువర్గాల కార్యకర్తలు గాయపడ్డారు. ఓ గ్రామంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భాజపా నేత నితీశ్‌ ప్రామాణిక్ తన అధికారాన్ని ఉపయోగించి.. పార్టీ కార్యాలయంలో ఆయుధాలను దాచిపెట్టారని టీఎంసీ ఎన్నికల సంఘానికి (EC) లేఖ రాసింది. కూచ్‌బెహర్‌లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఈ దశ పోలింగ్‌లో బెంగాల్‌ నుంచి ఈసీకి 100కు పైగా ఫిర్యాదులు అందాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని