Gutha Sukender reddy: అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. 

Published : 21 Apr 2024 00:07 IST

హైదరాబాద్‌: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ఇప్పుడు కష్టాల్లో ఉందన్న ఆయన.. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే పార్టీ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు. 

‘‘ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని భారాస ఫిర్యాదు చేసింది. వాటిని పరిశీలిస్తున్నాం. న్యాయబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకుంటా. నా కుమారుడు అమిత్‌రెడ్డికి భారాస ఎంపీ టికెట్‌ ఇవ్వలేదనేది అవాస్తవం. ఆయన్ను ఎంపీగా పోటీలో దించాలని స్వయంగా కేసీఆర్‌ కోరారు. దానికి అమిత్‌ కూడా సిద్ధమయ్యారు. జిల్లాలోని నాయకుల నుంచి సహకారం అందలేదు. కొందరు నేతలు తామే పార్టీ మారుతున్నామని చెప్పారు. అందుకే అమిత్‌ పోటీ నుంచి వైదొలిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించా. ఆరు నెలలు ప్రయత్నించినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై నాయకత్వంపై దృష్టి సారించాలి’’ అని గుత్తా అన్నారు.

గుత్తా వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదు: జగదీశ్‌రెడ్డి

గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఆయన చాలా సీనియర్‌ నాయకుడని, పార్టీ నిర్మాణంపై ఆయన సలహాలు తీసుకుంటామని అన్నారు. ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు గుత్తాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. గుత్తా మాట్లాడిన అంశాలపై ఎంపీ ఎన్నికల తర్వాత చర్చిస్తామన్నారు.  ఆయన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని