Rahul Gandhi: ప్రియాంక పోటీ చేస్తే.. మోదీ ఓడిపోయేవారు: రాహుల్‌ గాంధీ

ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ పరాజయం పాలయ్యేవారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 12 Jun 2024 00:07 IST

రాయ్‌బరేలీ: ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసి ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఓడిపోయేవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. కనీసం రెండు, మూడు లక్షల ఓట్ల తేడాతో తన సోదరి చేతిలో పరాజయం పాలయ్యేవారని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించిన ప్రత్యేక సభలో పాల్గొన్న రాహుల్‌, ప్రియాంక గాంధీలు.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘పార్లమెంటులో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలాన్ని తగ్గించేందుకు రాయ్‌బరేలీ, అమేఠీలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘ఇండియా’ కూటమి పార్టీలన్నీ ఐకమత్యంతో పోరాడాయి’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాల విషయంలో అహం ప్రదర్శించబోమని, ప్రజాప్రయోజనాల కోసం కృషి చేస్తామని తెలిపారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సామాన్యులను విస్మరించి.. పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకే మోదీ ప్రాధాన్యం ఇచ్చారని.. అందుకే అక్కడ భాజపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

చరిత్రాత్మక విజయం కట్టబెట్టారు: ప్రియాంక

అమేఠీ, రాయ్‌బరేలీల్లో హస్తం పార్టీకి ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ రోజు దేశమంతా అవధ్‌ (అయోధ్య) వైపు చూస్తోందని.. స్వచ్ఛమైన, అంకితభావంతో కూడిన రాజకీయాలు అవసరమనే సందేశాన్ని ఈ ప్రాంతం చాటిచెప్పినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో రోజూ రెండు, మూడు గంటలు మాత్రమే నిద్రకు కేటాయించి, మిగతా సమయంలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యానని చెప్పారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల సమన్వయంతోనే యూపీలో భారీ విజయాలను నమోదు చేసినట్లు చెప్పారు.

ఈసారి 230 మందిని సస్పెండ్‌ చేస్తారా..?: కాంగ్రెస్ ప్రశ్న

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటలైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీ, అమేఠీ నుంచి కిశోరీలాల్‌ శర్మ గెలుపొందిన విషయం తెలిసిందే. అయోధ్య క్షేత్రం ఉన్న ఫైజాబాద్‌లో కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై ఎస్పీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. మరోవైపు.. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ 37, కాంగ్రెస్‌ 6 సీట్లు సాధించాయి. భాజపా 33 స్థానాలకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని