BRS: రాజకీయ కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవిత అరెస్టు: హరీశ్‌రావు

రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 15 Mar 2024 20:36 IST

హైదరాబాద్‌: రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. శని, ఆదివారం కోర్టుకు సెలవు ఉంటుందని తెలిసి పథకం ప్రకారమే అరెస్టు చేశారు. మాపై బురదజల్లాలని, దెబ్బతీయాలని.. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

కవితను అరెస్టు చేస్తామని ఏడాదిన్నరగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, నాయకులు.. ఈడీ అధికారుల మాదిరిగా పలుమార్లు ప్రకటన చేశారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనగా.. హడావిడిగా ఇవాళ అరెస్టు చేయడమంటే భారాస, కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమే. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాసను దెబ్బతీయాలని భాజపా, కాంగ్రెస్‌ కుట్ర పన్నాయి. మాది ఉద్యమ పార్టీ. అరెస్టులు, వేధింపులు, కుట్రలు మాకు కొత్త కాదు. ఇలాంటివి ఎన్నో ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కవిత అరెస్టుపై రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉంది. దుర్మార్గ చర్యలపై భాజపా, కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు’’ అని హరీశ్‌రావు అన్నారు. 

కవిత తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు: జగదీశ్‌రెడ్డి

‘‘భాజపాను ఎదుర్కొన్నవారిపై దుర్మార్గాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి చర్యలు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో లబ్ధికి భాజపా యత్నిస్తోంది. సాక్ష్యాలు లేవన్నవాళ్లు ఇప్పుడు కవితను అరెస్టు చేశారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి దుర్మార్గాలు. కవిత తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు’’ అని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని