Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి.

Updated : 10 Oct 2023 14:17 IST

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.

యశ్వంత్‌ సిన్హా కేసును ప్రస్తావించిన సాల్వే..

17ఎ సెక్షన్‌ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్‌ కేసులో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్‌ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్‌ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ కొట్టివేసిన విషయాన్ని సాల్వే గుర్తుచేశారు. చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్‌ ముందు ఆయన ఉంచారు. ‘‘రఫేల్‌ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్‌ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్‌ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. 

ఈ కేసు మూలంలోనే దోషముంది..

వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్‌ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు.  స్పందించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. ఈ పరిణామాలను చూస్తే చంద్రబాబుపై ఆరోపణల విచారణకు కచ్చితంగా ముందే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి అని చెప్పారు. 2011లో జరిగిన దేవిందర్‌ పాల్‌సింగ్‌ బుల్లర్‌ కేసును ఈ సందర్భంగా హరీశ్ సాల్వే ప్రస్తావించారు. ‘‘కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్‌ కేసులో తీర్పు ఉంది. ప్రారంభమే చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ కేసు మూలంలోనే దోషం ఉన్నందున బుల్లర్‌ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నా. స్కిల్‌ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదు. దాన్నే సవాల్‌ చేస్తున్నా. అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు’’ అని హరీశ్‌ సాల్వే వాదించారు.

రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు: రోహత్గీ

2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్‌ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్‌ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. 

ఈ సమయంలో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది స్పందిస్తూ అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవేవీ పరిగణనలోకి తీసుకోవద్దని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోరారని.. ఆ చట్టమే వర్తించనప్పుడు అసలు కేసు మూలాల నుంచి కొట్టేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెబుతున్నారన్నారు. అనంతరం మళ్లీ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘‘అవినీతి నిరోధక చట్టం వర్తించనపుడు ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసును పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్‌ 420 పరిగణనలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం వర్తించదని కాదు. అనేక రకాల నేరాలు కలగలసి ఉన్నప్పుడు స్పెషల్‌ జడ్జికి విచారణాధికారం ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనుకున్నప్పుడు ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలి. నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలి. పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపజేయకూడదు. చట్టసవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలి. 17ఎ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయొచ్చు’’అని చెప్పారు.

17ఎ ప్రకారం ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్‌ దేనికీ అవకాశం లేదని బెంచ్‌ పేర్కొనగా.. పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17ఎ ఎలా వర్తిస్తుంది? అని రోహత్గీ వాదించారు. ‘‘17ఎను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు.. అందులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేం. 17ఎ సవరణ నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదు. నిజాయతీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేయడం కోసమే ఈ సవరణ చేశారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమల్లోకి వస్తుంది’’ అంటూ గతంలో ఇచ్చిన తీర్పును ముకుల్‌ రోహత్గీ ఉదహరించారు. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని