YS Jagan - YSRCP: ఇక చాలు జగన్‌... వైకాపా కకావికలం!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections) వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  (YS Jagan) నేతృత్వంలోని వైకాపా ఘోర ఓటమి పాలైంది. 2019లో భారీ ఆధిక్యంతో గెలుపొందిన పార్టీ ఇప్పుడు ఎందుకు విఫలమైంది, జగన్‌ ఓటమికి కారణాలేంటి? 

Updated : 04 Jun 2024 15:31 IST

 ‘ఒక్క ఛాన్సు ఇవ్వండి..’ , ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ అదేపనిగా చెప్పుకొని 2019లో గద్దెనెక్కిన జగన్‌.. అక్కడికెళ్లాక  మాట తప్పాడు. ప్రజలను దూరం పెట్టాడు. ఏపీ అభివృద్ధిని పాతాళం వైపునకు తీసుకెళ్లాడు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్ర నేలను కరవు సీమగా మార్చాడు. నిరుద్యోగులు, ఉద్యోగులను కష్టాల కొలిమి పాల్జేశాడు. ఎటుచూసినా అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారాడు. నెత్తిన పెట్టుకొన్న ఓటర్లు ఊర్కొంటారా! రాష్ట్రాన్ని పట్టించుకోక.. ప్రజల సమస్యలు తీర్చక.. ఆకాశమే హద్దుగా విధ్వంస పాలనకు తెగబడిన అక్రమార్కుడికి బుద్ధి చెబుతూ, 151 ఇచ్చిన వారే నేల మీదకు దించారు.

మూడు ముక్కలాట.. భూముల వేట

ఓ రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి! ఇది వినడానికే విడ్డూరం! కానీ ఇదే జరిగింది. ఏపీకి ఇది జగన్‌ చేసిన మోసం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘అమరావతికి సై’ అన్న జగన్‌.. పీఠమెక్కాక మూడు రాజధానులు అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’, ‘అభివృద్ధి’ అంటూ మాయమాటలు చెప్పారు. మాటల కోటలే కానీ అభివృద్ధి దిశగా అడుగు వేసింది లేదు. దాంతో ప్రజా రాజధాని అమరావతిని ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. పాలనా రాజధానిగా విశాఖని పిలిచి అక్కడ చేసిందేంటంటే.. భూముల పందేరం. కనిపించిన చోటల్లా కబ్జాలు చేయడం. ప్రశాంత విశాఖ చుట్టుపక్కల చాలా భూములు ఇప్పుడు వైకాపా నాయకుల  చేతుల్లో ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. అమరావతినీ, ఉత్తరాంధ్రనీ తిరోగమనం దిశగా మళ్లించిన జగన్‌.. న్యాయ రాజధాని అంటూ కర్నూలు జనాలనూ మభ్యపెట్టారు. తానాడిన ఈ మూడు ముక్కలాటలో ప్రజలు తాత్కాలికంగా వెనకడుగు వేసి ఉండొచ్చు. కానీ ఓటేసే సమయం వచ్చీరాగానే.. ప్రభుత్వంపై వేటు వేసేశారు.  

బటన్‌ నొక్కారు..  పన్నులతో బాదారు!

‘ఇలా బటన్‌ నొక్కడం, మీ ఖాతాలోకి డబ్బులు రావడం’ అంటూ గత ఐదేళ్లుగా జగన్‌ నెలకోసారి బటన్‌ నొక్కుతూనే ఉన్నారు. పథకం ఏదయినా అది కామన్‌. ‘సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని మీ ఖాతాలో వేశాం’ అని గొప్పలు చెప్పుకొన్నారు. కానీ పావలా ఇచ్చి రెండ్రూపాయలు దోచేసే పద్ధతుల్ని అమల్లో పెట్టారు. దశల వారీగా మద్యనిషేధం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నాసిరకం, హానికరమైన మద్యంతో రాష్ట్రాన్ని నింపేసి.. ఎందరో మరణాలకు కారణమయ్యారు. ప్రభుత్వ ఖజానా నింపుకొన్నారు. చెత్తపన్ను వేసిన గొప్ప ప్రభుత్వమూ ఇదే! పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఏపీలోనే అత్యధికం. ఇక ‘వాహన మిత్ర’ని చూడండి.  ఉదయం డబ్బులు పడతాయి. సాయంత్రానికల్లా  పన్నుల బాదుడు. ‘మీరిచ్చే డబ్బులు మా ఆటోలు, కార్లు, వాహనాల రిపేర్లకే సరిపోవడం లేదు. మంచి రోడ్లు వేసి కాపాడండి మొర్రో’ అని ప్రజలు అదేపనిగా హారన్‌ కొట్టినట్టు వేడుకున్నారు. వింటేగా? పెడచెవిన పెట్టారు. అందుకే ‘గెలుపు శబ్దం’ వినబడకుండా చేశారు.

అభివృద్ధా.. అదెక్కడ? 

‘ప్రతి నెలా డబ్బులు వేశాను.. ఇక జనాలు ఓట్లు వేయడం ఒక్కటే బాకీ..’ అనుకుంటూ ఇన్నేళ్లు కలలు కన్న జగన్‌కు ‘అభివృద్ధి’ అనే పదమే తెలియదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభోత్సవం చేశారా? చంద్రబాబు ప్రభుత్వం  దాదాపు పూర్తి చేసిన పనులు, ప్రాజెక్టులకు మరోసారి పునాదులు వేశారు. ఒకవేళ అప్పటికే ఆ పని పూర్తయి పోయుంటే ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధి అంటే వైకాపా నాయకులకు మాత్రమే - అనేలా వ్యవహరించడంతో.. ఓట్లలో, సీట్లలో బాగా కోత పడింది. 

జనాల మధ్యకు రారు.. దొరగారు 

గత ఎన్నికలకు ముందు జగన్‌ ప్రజల మధ్యకి పాదయాత్ర అంటూ వచ్చారు. ‘నేను మీ అన్నని’, ‘మీ మామని’, ‘మీ బిడ్డని’ అంటూ ప్రజల్ని హత్తుకున్నారు. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అలానే ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు వింటారేమో అనుకున్నారు. ‘సీఎం’ కాగానే కామన్‌ మ్యాన్‌ను మరిచిపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌నే ప్రపంచమనీ, అందులోని వారే జనాలనీ అనుకున్నారు. ఆయన బయటికొచ్చినా ప్రజలకు భయమే.  ‘దొరగారు బయటకు రాకపోవడమే బెటర్‌’ అనుకున్నారు. ఎందుకంటే సార్‌ బయటికొస్తే జనాలకు బస్సులు ఉండవు. పచ్చని చెట్లను నరికేస్తారు. హెలికాప్టర్‌లో వెళ్తున్నా.. కింద నేలపై గంటల కొద్దీ ట్రాఫిక్‌ ఆపేస్తారు. ఇదంతా చూసిన  ప్రజలు ‘మా బాధ పట్టని వాడికి మేమెందుకు ఓటు వేయాలి’ అనుకున్నారు. లెక్క సరిచేశారు. 

తల్లీ చెల్లీ కనపడరు.. ప్రజలెంత?

‘మీరే నా కుటుంబం.. మీ కోసమే నేను’ అంటూ 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో చెప్పిన సందర్భాలు బోలెడు. ఇదంతా నమ్మిన జనాలకు ఓటేశాక అసలు కథ తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సొంత బాబాయి వైఎస్‌ వివేకా హత్య కేసు విషయంలో ప్లేటు ఫిరాయించారు. ‘నిందితులకు కచ్చితంగా శిక్షపడాలి’ అని చెప్పిన నోరు ఒక్కసారిగా మూగబోయింది. తల్లి విజయమ్మను పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. సోదరి షర్మిలను పొగబెట్టి బయటకు పంపేశారు. ఇక ‘అన్నా న్యాయం పక్కన నిలబడు’ అంటూ వచ్చిన వివేకా తనయ సునీతా రెడ్డి మీద ‘సొంతవాళ్ల’తో నానా మాటలు అనిపించాడు. ఆఖరికి ఇద్దరు చెల్లెళ్లు రోడ్డెక్కి ‘కొంగుచాపి’ మాకు న్యాయం చేయమని వేడుకున్నారు. ‘రాజధర్మమైనా పాటించు’ వివేకా భార్య కోరారు. ఇవేవీ జగన్‌ మనసుని కరిగించలేదు. ఇలాంటి పాషాణ హృదయుడు మాకు వద్దంటూ పదవి నుంచి దించేశారు.  

తప్పులు తాను చేసి.. 

తాను తప్పు చేసి.. చుట్టూ ఉన్నవాళ్ల మీద నెట్టేసి, పక్కన పెట్టేసే వాళ్లను చూశారా? దీనికి నిలువెత్తు ఉదాహరణ వైఎస్‌ జగనే. ఆ గుణమే ఆయన్ను ఇప్పుడు సీఎం పదవి నుంచి కిందకు దింపేసింది. అసమర్థ, అవినీతి పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది అనే విషయం పసిగట్టిన జగన్‌.. తాను మారకుండా, తన పార్టీ అభ్యర్థులను మార్చారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. పక్క జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్‌లను చేశారు. అందుకు ఓ ఉదాహరణ నెల్లూరు నుంచి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను తీసుకొచ్చి నరసరావుపేటలో నిలబెట్టారు. ఇంతలా అభ్యర్థులను మార్చి ఏమార్చాలని చూసినా ‘ఇక చాలు’ జగన్‌ అని ఓటర్లు చెప్పేశారు.  

దోచుకోడానికి ఓ చట్టం..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌…  అందంగా, ముచ్చటగా కనిపిస్తున్న పేరు ఇది.  ఈ చట్టాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేశారు జగన్‌. ప్రయోగాత్మకంగా ఈ చట్టం అమలు చేస్తున్నాం అని చెప్పినా.. దాని వెనుక పెద్ద భూ దోపిడీకి ప్రణాళిక రచించారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు అమలు చేయాల్సిన చట్టాన్ని.. తనకు నచ్చినట్లుగా మార్పులు చేసుకుని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. భూములను పార్టీ వాళ్లు, తనవాళ్లు గుంజేసుకునేలా తన మనుషులనే అధికారులుగా పెట్టుకునే చట్టాన్ని తయారు చేశారు. అయితే ఈ చట్టం వెనుక కుట్రను పసిగట్టిన కూటమి నేతలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంతటి ప్రమాదకారి మాకొద్దు అని పంపించేశారు. 

ఉద్యోగాలు.. మా దగ్గర ఇవ్వరమ్మా 

ఉద్యోగాల సంగతి చెప్పాలంటే..  ‘నిరుద్యోగుల ఆర్తనాదాలు వినని నీరో చక్రవర్తి’ అని జగన్‌కి పేరు. వచ్చీ రాగానే  రెండున్నర లక్షల ఉద్యోగాలు వేసేశాం అంటుంటారు. అవి ఎక్కడ, ఏవి, ఎలాంటివి అనే మాట చెప్పరు. ఉద్యోగ ప్రకటనలు, నోటిఫికేషన్లు అయినా ఇచ్చారా అంటే… అవీ లేవు. మెగా డీఎస్సీ అని ఎన్నికలకు ముందు ఓ దగా డీఎస్సీ వేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల సంగతి సరేసరి.   ఇక ప్రైవేటు కంపెనీలు ఏమైనా వచ్చేలా చేశారా అంటే అదీలేదు. అప్పటికే స్థిరపడిన కంపెనీలను, వస్తాయని చెప్పిన వాటిని బెదిరించి భయపెట్టారు. దీంతో ‘మాకొద్దు ఏపీ’ అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర తీసుకొని ‘మాకొద్దు జగన్‌’ అని బైబై చెప్పేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు.. వామ్మో

ప్రతి నెలా ఒకటో తేదీన జీతం అందుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి పరిస్థితి ఏపీలో గత ఐదేళ్లలో లేదు. ‘జీతమో జగనా!’ అంటూ ఐదేళ్లు బాధపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి టాయిలెట్ల  ఫొటోలు తీయడం, వైన్‌ షాప్‌ దగ్గర కూర్చొని లెక్కలు చూడటం లాంటివి ఈ ప్రభుత్వంలోనే చూశాం. ఆర్టీసిని తూతూ మంత్రంగా ప్రభుత్వ సంస్థల్లో కలిపేసి ఉద్యోగుల అవసరాలను  గాలికొదిలేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు  ‘ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం చాలు’  అనుకున్నారు. రెండో ఛాన్సు లేకుండా.. రెండు పదుల సంఖ్య సీట్ల కంటే తక్కువకే పరిమితం చేశారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని