LS polls: ముగిసిన ఆరో దశ ప్రచారం.. అందరి చూపు ఎర్రకోట వైపు!

దేశ రాజధానిలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ ఉండడంతో అందరి చూపు ఎర్రకోట వైపు మళ్లింది.

Published : 23 May 2024 21:57 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా ఆరో దశ ప్రచారానికి గడవు ముగిసింది. ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు మే 25న పోలింగ్‌ జరగనుంది. హరియాణా, పంజాబ్‌, ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన పలు పార్టీల అగ్రనేతలు.. ప్రచారంతో హోరెత్తించారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ ఉండడంతో అందరి చూపు ఎర్రకోట వైపైనే ఉంది.

దిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలుండగా.. ఆరో దశలో ఒకేరోజు అక్కడ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్ల కోసం 13వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 162 మంది బరిలో ఉన్నారు. దాదాపు లక్ష మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

మోదీ పరివార్‌..

దేశ రాజధాని దిల్లీలో మోదీ పరివార్‌ ముమ్మర ప్రచారం చేసింది. ప్రధానమంత్రి రెండు బహిరంగ సభల్లో పాల్గొనగా.. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కూడా ముమ్మర ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌లు రాజధానిలో చివరి రోజు సుడిగాలి పర్యటనలు చేశారు. వీరితోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌లు ప్రచారాల్లో మునిగిపోయారు.

‘ఇండియా’ జోరు..

కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, సచిన్‌ పైలట్‌లు నగరంలో ముమ్మర ప్రచారం చేశారు. నార్త్‌వెస్ట్‌ దిల్లీలోని మంగోల్‌పురి, నార్త్‌ ఈస్ట్‌ దిల్లీలోని దిల్షాద్‌ గార్డెన్‌ ప్రాంతాల్లో రాహుల్‌ ప్రచారం నిర్వహించారు. మెట్రో రైల్లో వెళ్లిన ఆయన.. ప్రయాణికులతో ముచ్చటించారు. నగరంలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలోనూ రాహుల్‌ పాల్గొన్నారు.

Deve Gowda: లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని వార్నింగ్‌

మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించగా.. ఆప్‌ అభ్యర్థికి మద్దతుగా సచిన్‌ పైలట్‌ ప్రచారం చేశారు. ఇక్కడ ఆప్‌ మూడు చోట్ల పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ నాలుగు స్థానాలో బరిలో నిలిచింది. కేజ్రీవాల్‌ రాకతో అక్కడి ఆప్‌ కార్యకర్తల్లో ఫుల్‌ జోష్‌ కనిపించింది. అంతకుముందు దిల్లీ సీఎం తరఫున ఆయన భార్య సునీత ప్రచారం చేయగా.. భారీ స్పందన కనిపించింది.

మరోవైపు, బిహార్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటి పరిధిలో 1.5కోట్ల మంది ఓటర్లు ఉండగా..86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హరియాణాలో మొత్తం 10లోక్‌సభ స్థానాలతోపాటు కర్నాల్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ ఉప ఎన్నిక బరిలో ఉండగా.. మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వీటితోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని