Deve Gowda: లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని వార్నింగ్‌

ప్రజ్వల్‌ ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు.

Updated : 23 May 2024 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్‌ను హెచ్చరిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు.

సహనాన్ని పరీక్షించొద్దు..

‘‘ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి మే 18న ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడా. అతడు నాకు, నా కుటుంబం, పార్టీ, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ, ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ కేసులో దోషిగా తేలితే కఠినశిక్ష పడాల్సిందే. నా కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడు. ప్రజ్వల్‌.. ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో. నా సహనాన్ని పరీక్షించవద్దు. ఇది నా విజ్ఞప్తి కాదు.. వార్నింగ్‌. లేదంటే నాతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావ్‌’ అని హెచ్చరిక లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.

హద్దులు దాటి వధువుకు ‘కిస్సు’.. ఇరుకుటుంబాలు కస్సు బుస్సు

కొన్ని వారాలుగా ప్రజలు తనపై, తన కుటుంబంపైనా కఠిన పదాలు వాడుతున్న విషయం తెలుసునని దేవెగౌడ వెల్లడించారు. వాస్తవాలు బయటకు వచ్చేవరకు వాటిని ఆపాలని వారికి చెప్పడం ఇష్టం లేదన్నారు. అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు తనవెంటే ఉన్నారన్న ఆయన.. వారికి ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమని మాజీ ప్రధాని స్పష్టంచేశారు. అంతకుముందు ఈ విషయంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. తాతపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు