AP LOK SABHA: భారీ ఆధిక్యంతో.. కూటమి ఎంపీ అభ్యర్థులదే హవా

AP LOK SABHA: ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించింది.

Updated : 04 Jun 2024 23:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను తెదేపా 16చోట్ల గెలిచి ప్రభంజనం సృష్టించింది. భాజపా మూడు స్థానాలు గెలుచుకోగా.. జనసేన 2 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. వైకాపా నాలుగు స్థానాలకే పరిమితమైంది. విశాఖ తెదేపా అభ్యర్థి భరత్‌ 5లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కూటమి అభ్యర్థుల్లో చాలా మంది 2లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. ఏపీలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..

 • విశాఖపట్నంలో తెదేపా అభ్యర్థి మతుకుమిల్లి భరత్‌ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 5,04,247 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.
 • గుంటూరులో తెదేపా అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ వైకాపా అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై భారీ విజయం సాధించారు. 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.
 • అమలాపురంలో తెదేపా అభ్యర్థి గంటి హరీష్‌ వైకాపా అభ్యర్థి రాపాక వరప్రసాదరావుపై విజయఢంకా మోగించారు.తన ప్రత్యర్థిపై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించారు.
 • శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్‌పై దాదాపు 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • విజయవాడలో తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని తన సోదరుడు కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
 • నరసాపురంలో భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • నెల్లూరులో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 2,45,902 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • విజయనగరంలో తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై దాదాపు 2.4లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
 • రాజమండ్రిలో భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి శ్రీనివాసులుపై 2.31లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ (టీ టైం ఉదయ్‌) భారీ విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి చలమశెట్టి సునీల్‌పై 2,29,491 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. 
 • చిత్తూరులో తెదేపా అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఎన్‌.రెడ్డప్పపై 2,20,479 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
 • అనకాపల్లిలో భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ వైకాపా అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుపై దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 • బాపట్లలో తెదేపా అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌ వైకాపా అభ్యర్థి నందిగం సురేష్‌పై దాదాపు రెండు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
 • మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. వైకాపా అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుపై బాలశౌరి 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు.
 • అనంతపురంలో తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఎం.శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 • ఏలూరులో తెదేపా అభ్యర్థి పుట్టా మహేశ్‌ యాదవ్‌ గెలుపొందారు. వైకాపా అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌పై 1,81,857 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 • నరసరావుపేటలో తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై 1,59,729 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
 • తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి భాజపా అభ్యర్థి వరప్రసాదరావుపై  1.45లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
 • నంద్యాలలో తెదేపా అభ్యర్థి భైరెడ్డి శబరి వైకాపా అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందారు. శబరి 1,11,975 ఓట్ల మెజార్టీ సాధించారు.
 • కర్నూలులో తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు వైకాపా అభ్యర్థి బీవై రామయ్యపై 1,11,298 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 
 • హిందూపురంలో తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి వైకాపా అభ్యర్థి శాంతపై విజయం సాధించారు. దాదాపు లక్ష ఓట్లకు పైనే మెజార్టీ సాధించారు.
 • కడపలో వైకాపా అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డిపై 62వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షరాలు షర్మిలకు 1,41,039 ఓట్లు వచ్చాయి.
 • రాజంపేటలో వైకాపా అభ్యర్థి మిథున్‌ రెడ్డి భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 • అరకులో వైకాపా అభ్యర్థి  తనూజారాణి చేతిలో భాజపా అభ్యర్థి కొత్తపల్లి గీత ఓటమిపాలయ్యారు. తనూజా రాణికి 50,580 ఓట్ల మెజార్టీ వచ్చింది.
 • ఒంగోలులో తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు.  వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై 48 వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని