Exit polls: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎప్పుడెలా?

Exit polls: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎప్పుడెలా?

Updated : 30 May 2024 17:52 IST

Exit polls |  ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌పై (Exit polls) ప్రజల్లో సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో వేసే ఈ అంచనాలకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరింది. జూన్‌ 1న ఏడోవిడత పోలింగ్‌ ముగియనుంది. అదేరోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్నిసార్లు నిజమయ్యాయి? ఎన్ని బోల్తా కొట్టాయ్‌?

నిజమైన వేళ..

  • 1996: సీఎస్‌డీఎస్‌ అనే సంస్థ 1996లో లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను వెల్లడించింది. తీర్పు అస్పష్టంగా ఉండబోతోందని తెలిపింది. ఆ సంస్థ అంచనా వేసినట్లుగానే ఫలితాలు వచ్చాయి.
  • 1998: లోక్‌సభ ఎన్నికల్లో చాలా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి. భాజపాకు 200పైచిలుకు సీట్లు వస్తాయని వెల్లడించాయి. భాజపా కూటమి మెజారిటీకి దగ్గరగా వస్తుందని తెలిపాయి. అన్నట్లుగానే 1998లో భాజపా కూటమికి 252 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 166 సీట్లు దక్కాయి. ఇతరులకు 119 సీట్లు వచ్చాయి.
  • 2014: లోక్‌సభ ఎన్నికల్లో పలు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మారబోతోందంటూ పలు సంస్థలు చెప్పాయి. అన్నట్లుగానే ఎన్‌డీయే కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఓ సంస్థ ఈ కూటమికి 340 సీట్లు వస్తాయని అంచనా వేయగా 334 వచ్చాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి 70 సీట్లే వస్తాయని చెప్పగా 60 వచ్చాయి.
  • 2019: ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి. భాజపాకు 336, 339-365 సీట్లు వస్తాయని రెండు సంస్థలు చెప్పగా 353 సీట్లతో ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. యూపీఏకు 82 సీట్లు వస్తాయని అంచనా వేయగా దాదాపుగా అంతే వచ్చాయి.
  • 2021: కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కలు నిజమయ్యాయి. కేరళలో ఎల్‌డీఎఫ్‌కు అధికారం వస్తుందని చెప్పగా అదే జరిగింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌దే విజయమని ఒకటి రెండు సంస్థలు చెప్పగా నిజమైంది. అదే సమయంలో కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు కావడం గమనార్హం.
  • 2023: తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. అనుకున్నట్లుగానే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. 

ఒపీనియన్‌ పోల్‌కు ఎగ్జిట్‌ పోల్‌కు మధ్య వ్యత్యాసం ఏంటి?

తారుమారైన వేళ..

  • 2004: ఎనిమిది నెలల ముందుగా లోక్‌సభను అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది. అంతకుముందుగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించడంతో అతి విశ్వాసంతో భాజపా కూటమి ఎన్నికలకు వెళ్లింది. ఆ సమయంలో ఎన్‌డీయేకి 330 సీట్లు వస్తాయని ఒక సంస్థ అంచనా వేయగా మిగిలినవి 270 వస్తాయని పేర్కొన్నాయి. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్‌డీయేకి 181 సీట్లే వచ్చాయి.
  • 2015: బిహార్‌, దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. బిహార్‌లో భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా జేడీయూ-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పినా మొత్తం 70 సీట్లలో 67 వస్తాయని ఏ సంస్థా అంచనా వేయలేదు.
  • 2017: ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. అయితే భాజపా స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లోనూ హంగ్‌ వస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా అధికారం సాధించింది.
  • 2018: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పలేకపోయాయి. కానీ ఆ పార్టీ భారీ విజయం సాధించింది.
  • 2019: మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపా అధికారం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. కానీ రెండు రాష్ట్రాల్లో హంగ్‌ అసెంబ్లీలే ఏర్పడ్డాయి.
  • 2020: బిహార్‌లో ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా భాజపా-జేడీయూ కూటమి అధికారం చేజిక్కించుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని