MK Stalin: ‘నా ఎత్తెంతో నాకు తెలుసు’.. స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

MK Stalin: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా నిలబడతారా?అన్న ప్రశ్నకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికరంగా బదులిచ్చారు. ‘నా ఎత్తెంతో నాకు తెలుసు’ అన్నారు.

Published : 05 Jun 2024 13:08 IST

చెన్నై: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపైనే..! ఎన్డీయే (NDA) కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ.. అనూహ్య పరిస్థితులు ఎదురైతే ఇండియా కూటమి (INDIA Bloc) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని గురించి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను మీడియా ప్రశ్నించింది. ‘ఒకవేళ ఇండియా కూటమికి అవకాశం లభిస్తే.. ప్రధాని అభ్యర్థి రేసు (PM Race)లో మీరు ఉంటారా?’ అని అడగ్గా.. సీఎం ఆసక్తికరంగా బదులిచ్చారు.

తన తండ్రి కరుణానిధి (Karunanidhi) ఫేమస్‌ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పా’’  అని విలేకరులతో అన్నారు. ఈసందర్భంగా ఎన్నికల ఫలితాల (Lok Sabha Elections)పై మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో మా కూటమికి 39 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 40కి 40 సాధించాం. ఈ విజయాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నా. చాలా రాష్ట్రాల్లో మోదీ వ్యతిరేక గాలి వీచింది’’ అని అన్నారు. బుధవారం సాయంత్రం జరిగే ఇండియా కూటమి పార్టీల సమావేశంలో తాను పాల్గోనున్నట్లు చెప్పారు.

‘మరీ అంత నిజాయతీ వద్దేమో’: ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నటుడి పోస్టు వైరల్‌

గతంలో కరుణానిధి ‘ఎత్తు’ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ, కేంద్రంలో పాలన జోలికి వెళ్లకుండా రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. అయితే 1997లో దేవెగౌడ ప్రభుత్వం పడిపోయాక.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆఫర్‌ కరుణానిధికి వచ్చిందట. ఇందుకోసం నేషనల్‌ ఫ్రంట్‌లోని కొంతమంది నేతలు ఆయనను సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు’ అంటూ కరుణానిధి నాటి ఆఫర్‌ను తిరస్కరించినట్లు కథనాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని