Ashok Gehlot: సీఎం కుర్చీని వదులుకోవడానికి సిద్ధమే కానీ..: గహ్లోత్‌ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్ కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot), మరో నేత సచిన్‌ పైలట్‌(Sachin Pilot) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా గహ్లోత్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Updated : 19 Oct 2023 16:34 IST

దిల్లీ: సీఎం పదవికోసం సహచర నేత సచిన్‌ పైలట్‌(Sachin Pilot) నుంచి పోటీ ఎదురవుతోన్న వేళ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్(Rajasthan CM Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధం అంటూనే.. వదిలిపెట్టేందుకు అనాసక్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

నాలుగోసారి కూడా తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఓ సందర్భంలో ఓ మహిళా కార్యకర్త కోరిన విషయాన్ని గహ్లోత్‌(Ashok Gehlot) గుర్తుచేసుకున్నారు. ‘నేను సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఆ కుర్చీనే నన్ను వదలడం లేదు. అది నన్ను వదలకపోవచ్చు కూడా’ అని అప్పుడు తాను ఆమెకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు గహ్లోత్‌ సరదాగా చెప్పినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌(Congress) గెలిస్తే సీఎం పోస్టు మళ్లీ తనదే అని పైలట్‌కు పరోక్షంగా వెల్లడించినట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘సోనియా గాంధీజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన వెంటనే.. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం నన్ను ముఖ్యమంత్రిని చేయడమే. నేను అప్పటికీ సీఎం అభ్యర్థిని కాకపోయినా.. ఆమె నన్ను సీఎంగా ఎంపిక చేశారు’ అని ఈ సందర్భంగా చెప్పారు.

ఎప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేటీఆర్‌

2020లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అసమ్మతితో పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అప్పుడు గహ్లోత్‌ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కనిపించాయి. అయితే అధిష్ఠానం బుజ్జగింపులతో పైలట్‌ తన మనసు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంతో కథ సుఖాంతం అయింది. అప్పటినుంచి రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా గహ్లోత్‌ అవే మాటలు చెప్పారు. ‘మేమంతా కలిసి ఉన్నాం. నేను ఏ ఒక్కరినీ వ్యతిరేకించడం లేదు’ అని స్పష్టం చేశారు. 

అలాగే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యంపై ప్రశ్నించగా.. ‘ప్రతిపక్ష భాజపా మాత్రమే ఈ జాబితాపై కలవరపడుతోంది. మేం ఘర్షణ పడటం లేదని వారు నిరాశ చెందుతున్నారు. పార్టీలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. నేను సచిన్‌ పైలట్‌ మద్దతుదారులతోనూ మాట్లాడుతున్నాను. నేను క్షమించు-మర్చిపో అనే మంత్రాన్ని అనుసరిస్తున్నాను(పైలట్‌ వర్గాన్ని ఉద్దేశించి). అలాగే మెరుగైన ప్రత్యామ్నాయం కనిపిస్తే.. సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతాం’ అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్‌ 25న రాజస్థాన్‌ ఎన్నికలకు వెళ్లనుంది. డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని