లోక్‌సభకు పోటీ చేయాలని కోరిక.. ఒక్క ఛాన్స్‌ అడిగా: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఒడిశా నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనేది తన కోరిక అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఈ విషయాన్ని పార్టీ ముందు ఉంచినట్టు చెప్పారు.

Published : 07 Oct 2023 01:58 IST

దిల్లీ: కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశా నుంచి లోక్‌సభ(Loksabha)కు పోటీ చేయాలనేది తన కోరిక అన్నారు. అందువల్ల తనకు ఒక అవకాశం ఇవ్వాలని భాజపా(BJP)ను కోరినట్టు చెప్పారు. శుక్రవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడారు.  విపక్ష కూటమి ‘ఇండియా’ను నిజమైన సవాల్‌గా తాను భావిస్తున్నట్లు చెప్పారు. భాజపా, ఎన్డీయే ఎన్నికలను అంత ఆషామాషీగా తీసుకోవడం లేదన్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి అగ్ర నేతల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ముందుండి నడిపిస్తారన్నారు. 

వైకాపా పాలనకు చరమగీతం పాడాలి: పవన్‌

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రజలకు సేవ చేయాలనేది తమ పార్టీ అజెండా అని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో దేశంలోని మన మాతృమూర్తులు, సోదరీమణులకు రాజకీయ హక్కులను కల్పించడం ద్వారా మోదీ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్‌ హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఆమోదించేందుకు అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదని మండిపడ్డారు.  దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న రాహుల్‌ గాంధీ డిమండ్‌ పైనా ప్రధాన్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ అని.. ఓబీసీలు, బలహీనవర్గాల కోసం గత 75 ఏళ్లలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు.  భాజపా నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని