Rahul Gandhi: మోదీని దేవుడు అందుకే పంపారేమో..! రాహుల్‌ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఒకవైపు ‘ఇండియా’ కూటమి, రాజ్యాంగం ఉన్నాయని.. మరోవైపు దాన్ని నాశనం చేయాలని భావిస్తున్నవారు ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 28 May 2024 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) తన హృదయం, ప్రాణం, రక్తాన్ని ధారపోసి మరీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తనను దేవుడే పంపాడంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పేదలకు కాకుండా, ఓ వ్యాపారవేత్తకు సాయం చేసేందుకే ఆయన వచ్చారంటూ ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాన్స్‌గావ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు.

‘‘ప్రస్తుత ఎన్నికలు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు. ఒకవైపు ‘ఇండియా’ కూటమి, రాజ్యాంగం ఉన్నాయి. మరోవైపు దాన్ని నాశనం చేయాలని భావిస్తున్నవారు ఉన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే సాహసం ఎవరూ చేయలేరు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని తెలిపారు. ‘అగ్నిపథ్‌’ పథకం ద్వారా ప్రధాని మోదీ.. సైనికులను కార్మికులుగా మార్చారని ఆరోపించారు. దీన్నీ రద్దు చేస్తామని ఉద్ఘాటించారు.

జూన్‌ 4 తర్వాత ఆయన మాజీ సీఎం: అమిత్ షా వ్యాఖ్యలు

‘‘ప్రధాని మోదీ దేశంలో 22 మంది బిలియనీర్లను సృష్టించారు. వారికి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఈ విషయంలో దేశం ఎప్పటికీ ఆయన్ను క్షమించదు’’ అని రాహుల్‌ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కోట్లాది మందిని లక్షాధికారులుగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పేదలకు రిజర్వేషన్లను కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో భాజపా చేసిన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారని అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు