Mamata Banerjee: ‘భాజపా’ సర్కారు ఎక్కువ రోజులు కొనసాగదు..! దీదీ కీలక వ్యాఖ్యలు

ఈ ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ మెజారిటీ లేని నేపథ్యంలో.. మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Published : 09 Jun 2024 00:04 IST

కోల్‌కతా: ఎన్డీయే కూటమి కేంద్రంలో మూడోసారి కొలువుదీరనున్న వేళ పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా (BJP)కు సంపూర్ణ మెజారిటీ లేని నేపథ్యంలో.. మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ‘ఇండియా’ కూటమి (INDIA bloc) ఇప్పుడు ముందుకు రాలేదేమో.. కానీ, దానర్థం భవిష్యత్తులో ఈ ప్రయత్నం చేయదని కాదన్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలు, నేతలతో కోల్‌కతాలో దీదీ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అస్థిరంగా, బలహీనంగా ఉన్న భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువ రోజులు కొనసాగదని, ఈ సర్కారు అధికారం కోల్పోతే సంతోషిస్తానని చెప్పారు. జాతీయ రాజకీయ పరిస్థితులపై తమ పార్టీ ప్రస్తుతం వేచి చూద్దామనే ధోరణిలో ఉందన్నారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి మాకు ఆహ్వానం రాలేదు: జైరాం రమేశ్‌

‘‘దేశంలో మార్పు అవసరం. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూడా ఆ దిశగానే మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. కాబట్టి.. ఈసారి ఆయన ప్రధాని కాకూడదు. వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలి. ప్రస్తుతం భాజపా అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ రోజు ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదేమో..! కానీ భవిష్యత్తులో అలా చేయదని దానర్థం కాదు. రానున్న రోజుల్లో విపక్ష కూటమిదే అధికారం’’ అని మమతా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి టీఎంసీ నేతలు హాజరుకారని స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ.. గత రెండు లోక్‌సభల మాదిరి ఏకపక్షంగా సాగబోదని, సీఏఏ రద్దు వంటి డిమాండ్లపై తమ పార్టీ ఎంపీలు గొంతెత్తుతారని చెప్పారు. అంతకుముందు సమావేశంలో భాగంగా టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని