Chandrababu: అప్పలనాయుడూ.. ఫ్లైట్‌ టికెట్‌ ఉందా?: ఎంపీలతో చంద్రబాబు భేటీలో ఆసక్తికర ఘటన

‘‘అప్పలనాయుడూ.. దిల్లీ వెళ్లడానికి విమాన టికెట్‌ ఉందా? తీసుకున్నావా? లేకపోతే చెప్పు మనవాళ్లు టికెట్‌ బుక్‌ చేస్తారు’’.. అంటూ విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి ఎంపికైన కలిశెట్టి అప్పలనాయుడిని తెదేపా అధినేత చంద్రబాబు ఆప్యాయంగా అడగడం సమావేశానికి హాజరైన ఎంపీల్ని భావోద్వేగానికి గురిచేసింది.

Updated : 07 Jun 2024 07:26 IST

అమరావతి: ‘‘అప్పలనాయుడూ.. దిల్లీ వెళ్లడానికి విమాన టికెట్‌ ఉందా? తీసుకున్నావా? లేకపోతే చెప్పు మనవాళ్లు టికెట్‌ బుక్‌ చేస్తారు’’.. అంటూ విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి ఎంపికైన కలిశెట్టి అప్పలనాయుడిని తెదేపా అధినేత చంద్రబాబు ఆప్యాయంగా అడగడం సమావేశానికి హాజరైన ఎంపీల్ని భావోద్వేగానికి గురిచేసింది. అప్పలనాయుడు లాంటి సామాన్య కార్యకర్తకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చిన పార్టీ అధినేత... ఆ కార్యకర్త స్థితిగతులు తెలుసుకుని, విమాన టికెట్‌పైనా ఆరా తీయడం వారిని కదిలించింది. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యులతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 

 సామాన్య కార్యకర్తకు, చిన్న నాయకులకూ పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించేలా తన నిర్ణయాలు ఉంటాయని చెప్పిన చంద్రబాబు... ఎంపీలు, ఇతర నాయకులు కూడా అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. కష్టపడి, విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయనడానికి అప్పలనాయుడే ఉదాహరణని తెలిపారు. అప్పలనాయుడికి ఎంపీ టికెట్‌ ఇస్తే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారని, కానీ ఆయన అందర్నీ కలుపుకొనిపోయి, కష్టపడి పనిచేసి గెలిచారని చంద్రబాబు తెలిపారు. అప్పలనాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా టికెట్‌ ఇచ్చామని, పార్టీలో సామాన్య కార్యకర్తలకూ అవకాశాలు వస్తాయనడానికి ఆయనొక ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఎంపీలంతా శుక్రవారం ఉదయానికల్లా దిల్లీ చేరుకోవాలని చెబుతూ... అప్పల నాయుడికి టికెట్‌ ఉందా? అని ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని