Devineni uma: బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని

ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

Updated : 20 May 2024 14:04 IST

అమరావతి : ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో ఎన్నికల అనంతరం ఓటేయలేదనే కక్షతో ముగ్గురు మహిళలపై దాడి చేశారు. ఈ ఘటనపై డీసీపీ ప్రెస్‌మీట్‌ను మీడియా చూపించింది. ఆ తర్వాత కూటమి నేత విష్ణుకుమార్‌రాజు ప్రెస్‌మీట్‌ను లైవ్‌లో చూపించినందుకు ఈటీవీ ప్రతినిధిని ఏ1, ఏబీఎన్‌ ప్రతినిధిని ఏ2, విష్ణుకుమార్‌రాజును ఏ3గా చేర్చారు. బాధితుల గొంతును వినిపిస్తే కేసులు పెడతారా? పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు.

మీడియాపైన పెట్టిన సెక్షన్లు కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. దీంతో కంచరపాలెం పోలీసుల స్వామి భక్తి దేశం మొత్తానికి తెలిసింది. డీసీపీ సత్తిబాబు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడ్డగోలుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయంపై సిట్‌, ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. ఈ ఘటనపై డీజీపీ వివరణ ఇవ్వాలి. దీని వెనుక సీఎస్‌, తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. ధనుంజయరెడ్డి, ఆంజనేయులు, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే ఎన్నికల అనంతరం మూడు ప్రాంతాల్లో హింస జరిగింది. వైకాపా దుర్మార్గాలను మీడియా తెలియజేయడం తప్పా? మీడియా స్వేచ్ఛపైనే దాడి చేస్తున్నారు. సీఎం జగన్‌ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి’’ అని దేవినేని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని