pawan kalyan: జీతం తీసుకుంటా.. ప్రతి రూపాయికీ బాధ్యతగా పనిచేస్తా

‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటూ మనకు బాధ్యతను గుర్తు చేసేదే.

Published : 06 Jun 2024 04:16 IST

ఐదుకోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి
పార్టీ కార్యాలయం ప్రజల కోసం తెరిచే ఉంటుంది
ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్‌కల్యాణ్‌

విజేతలతో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌. పక్కన నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటూ మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం ఐదు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.     ఈ సందర్భంగా ఆయన  ఏం మాట్లాడారంటే.. ‘ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును.. ఓ ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు మాట్లాడను. ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. అలా తీసుకుంటేనే ప్రజలకు నా పై అజమాయిషీ ఉంటుంది. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నాకూ ఉంటుంది. జీతం తీసుకుంటా..వారి కోసం సంపూర్ణంగా కష్టపడతా. ఎంత జీతం తీసుకుంటే దానికి వెయ్యి రెట్లు.. కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను. ప్రజలకు వారి అన్ని కష్టాల్లోనూ అండగా నిలుస్తా’ అని పవన్‌ అన్నారు. సినిమాలకు సెన్సార్‌ ఉంటుంది కానీ టీవీలకు ఉండదని, ఏం మాట్లాడినా ప్రజలు టీవీల్లో చూస్తారని, బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించాలని హితవు పలికారు. ‘భావితరాల వారు స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన ప్రయాణం ఉంటుంది. యువత రాజకీయాలను కెరీర్‌గా చేసుకోవాలనే స్ఫూర్తి నింపేలా జనసేన ముందుకు నడుస్తుంది’ అని అన్నారు. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపిద్దాం. గెలుపు తీసుకువచ్చిన అతిశయం ఉండకూడదు’ అని అన్నారు.


జనసేన తరఫున పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన వారితో పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌

ఎంపీలు పార్లమెంటులో సమస్యలు లేవనెత్తాలి

‘ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌ కీలకం. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తాలి. దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పని చేయాలి. గెలిచిన ఇద్దరూ 5 కోట్ల ప్రజల తరఫున నిలబడాలి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను బయటకు తీసుకువచ్చి నవ పునాదులు బలంగా నిర్మించాలి. జనసేన పార్టీ కార్యాలయాన్ని 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు జనసేన కార్యాలయం తలుపులు ఎల్ల వేళలా తెరిచే ఉంటాయి’ అని హామీ ఇచ్చారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం జనసేన ఏ విధంగా నిలబడుతుందో ఆచరణలో చూపుదామన్నారు. వందశాతం స్ట్రైక్‌ రేట్‌ అన్న పవన్‌ మాటల గొప్పదనం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ప్రతి సీటూ గెలవాలనే తలంపుతో ఆయన తీసుకున్న నిర్ణయం గర్వించదగ్గ అంశమని అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ ఒక పార్టీ వంద శాతం విజయం అన్న మాట ఎక్కడా వినలేదన్నారు. ఈ గెలుపు వెనుక పార్టీ అధ్యక్షుడి 17 ఏళ్ల శ్రమ దాగి ఉందన్నారు. పిఠాపురంలో పని చేసిన 45 రోజులూ ఎంతో నేర్చుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని