Jagadish Shettar: భాజపాకు షాక్‌.. కాంగ్రెస్ గూటికి శెట్టర్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Elections 2023) వేళ భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. సోమవారం లింగాయత్ వర్గంలో కీలక నేత అయిన జగదీశ్‌ శెట్టర్(Jagadish Shettar) కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

Updated : 17 Apr 2023 10:52 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కర్ణాటక( Karnataka)రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు భాజపాకు తలనొప్పిగా మారింది. టికెట్‌ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన కమలం పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌(Jagadish Shettar)సోమవారం కాంగ్రెస్‌(Congress)లో చేరారు.

అంతకుముందు ఆదివారం ఉదయం శెట్టర్‌.. ఎమ్మెల్యే పదవికి, భాజపా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత భాజపా(BJP)లో టికెట్‌ దక్కని ఆశావహులు, అనుచరులతో కలిసి ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సిద్ధంచేసిన రెండు విమానాల్లో హుబ్బళ్లి నుంచి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో బెంగళూరులోని కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అనంతరం శెట్టర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఒక సీనియర్ నేతగా నాకు టికెట్ వస్తుందనుకున్నా. కానీ, అలా జరగట్లేదని తెలిసి షాక్‌ అయ్యా. నాతో కనీసం ఎవరూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు’అని అన్నారు. ఖర్గే మాట్లాడుతూ..‘శెట్టర్ గురించి మీకు చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఒంటరిగా గెలవడమే కాదు.. మరిన్ని సీట్లు గెలిపించే సత్తా ఉన్న నేత’అని అభివర్ణించారు.  

20-25 సీట్లపై ప్రభావం ఉంటుందా..?

కొత్తవారికి అవకాశాలిచ్చే క్రమంలో హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్‌ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టర్‌( Jagadish Shettar)కు పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించారు. మాజీ సీఎం యడియూరప్ప తర్వాత అంతటి సీనియారిటీ ఉన్న తనను రాష్ట్రనేతల కారణంగా అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. లింగాయత్ వర్గంలో కీలక నేత అయిన ఆయన టికెట్ విషయంలో భాజపాకు హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే.

‘నాకు టికెట్‌ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ సీఎం యడియూరప్ప కూడా హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాకు టికెట్‌ ఇవ్వకపోతే.. భాజపా 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశముంది. రాష్ట్రమంతటా కూడా ఆ ప్రభావం ఉంటుంది’అని శెట్టర్‌ (Jagadish Shettar)వ్యాఖ్యానించారు. మరోపక్క.. పార్టీ వీడకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషి, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైలు శెట్టర్‌ను కలిసి బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత భాజపా ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కొన్ని సర్వేలను బట్టి తెలుస్తోంది. ఈ సమయంలో ఈ అగ్రనేత కాంగ్రెస్‌లో చేరడం భాజపాకు గట్టి దెబ్బనే చెప్పాలి. అలాగే ఈ ఎన్నికల్లో శెట్టర్ చెప్పిన ‘25 సీట్ల ప్రభావం’ ఏ మేరకు ఉంటుందో చూడాలి..!

కర్ణాటక (Karnataka)లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మే 10న పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని