CPI Narayana: జైలుకు వెళ్లకుండా ఉండేందుకే కేంద్రానికి జగన్ మద్దతు: సీపీఐ నేత నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన 30గంటల నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. 

Updated : 21 Nov 2023 15:23 IST

విజయవాడ: రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పునఃపంపిణీ గెజిట్‌ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో 30గంటల నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు నారాయణతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని విమర్శించారు. అయితే కరవు తీవ్రతను తక్కువగా ఉందనేలా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. కేసుల భయంతో ఆయన ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో వైకాపాను గెలిపిస్తే ప్రజా సమస్యలు పార్లమెంటులో లేవనెత్తడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే కేంద్రానికి జగన్ మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్ దిల్లీకి వెళ్లేది రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం కాదని.. కేసులు మాఫీకే కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

పోతేపోనీ నీళ్లు.. వస్తేరానీ కన్నీళ్లు!

జగన్‌ది తుగ్లక్‌ పాలన: వడ్డే శోభనాద్రీశ్వరరావు

కృష్ణాజలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. మిగులు జలాల్లో ఒక్క టీఎంసీ నీరు కూడా మనకు కేటాయించక పోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. మిగతా ప్రాజెక్టుల పరిస్థితి అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. 

444 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలి: దేవినేని ఉమ

ముఖ్యమంత్రి జగన్‌ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్‌కు వ్యవసాయం పట్ల అవగాహన లేదని విమర్శించారు. తక్షణమే 444 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైకాపా విఫలమైందన్నారు. భవిష్యత్తులో కరవు పరిస్థితిపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని