RLD: ఎన్నికల వేళ ‘ఎన్డీయే’లోకి మరో పార్టీ.. భాజపాతో జట్టుకట్టిన ఆర్‌ఎల్‌డీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ (RLD) శనివారం అధికారికంగా ఎన్డీయే కూటమిలో చేరింది.

Published : 02 Mar 2024 22:51 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తోన్న వేళ భాజపా (BJP)తో మరో పార్టీ జట్టుకట్టింది. ఊహాగానాలు నిజం చేస్తూ.. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) అధికారికంగా ఎన్డీయే (NDA) కూటమిలో చేరింది. ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ సింగ్‌ చౌధరి (Jayant Chaudhary) శనివారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. రానున్న ఎన్నికలకు కమలదళం తన తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. చౌధరీ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు జాట్ వర్గమే. యూపీలోని ముజఫర్‌నగర్, కైరానా, బిజ్నౌర్, మథుర, బాగ్‌పత్, అమ్రోహా, మేరఠ్‌లలో ఈ వర్గం ప్రాబల్యం ఎక్కువ.

వారణాసి నుంచి మోదీ.. భాజపా తొలి జాబితా విడుదల

‘ఇండియా’ కూటమిలోని ఆర్‌ఎల్‌డీ పార్టీ కొన్ని రోజుల క్రితం వరకూ యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి కీలక మిత్రపక్షంగా ఉంది. అఖిలేశ్‌ యాదవ్‌, జయంత్‌లు స్థానికంగా లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే.. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పొత్తు గురించి ఆయన మనవడైన జయంత్‌ను ప్రశ్నించగా.. ‘‘ఇప్పటివరకు ఇతర పార్టీలు చేయలేని పనిని మోదీ దార్శనికత చేసి చూపించింది. ఇప్పుడు భాజపా ఆఫర్‌ను ఎలా తిరస్కరించగలను..?’’ అంటూ బదులిచ్చారు. దీంతో ఆయన ఎన్డీయే వైపు మొగ్గుచూపడం ఖాయమనే వార్తలు వినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని