పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి

హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.

Updated : 21 May 2024 11:49 IST

గుంటూరు: హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  రెచ్చగొట్టె  వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయినా తప్పించుకుని హైదరాబాద్‌ పారిపోయారు. అక్కడ మీడియాతో మాట్లాడినా పిన్నెల్లిపై చర్యలు లేవు. ఆయనపై పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మాచర్లలో దాడులు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను పిన్నెల్లి కబ్జా చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారు. దాడి చేసి.. పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడతారా? అధికారుల జాబితా పంపింది.. నియమించింది మీ ప్రభుత్వమే కదా?’’ అని జూలకంటి ప్రశ్నించారు. 

పిన్నెల్లి పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు వెళ్లారు..

‘‘ప్రజలు భారీగా తరలివచ్చి వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 85 శాతానికిపైగా పోలింగ్‌తో వైకాపా తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ దాడుల్లో గాయపడిన వారికి నేర చరిత్ర లేదు. తెదేపా తరఫున ఏజెంట్లుగా కూర్చోవడమే వారు చేసిన తప్పా? రెంటాలలో ముంజులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ముగ్గురు సీఐలు, ఎస్‌ఐలు పిన్నెల్లి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. నేను ఎంపీగా ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ఎలాంటి చర్యకైనా నేను సిద్ధం.. నా ఫోన్లు కూడా ఇస్తా. మాచర్ల దాడులకు వైకాపా అనుకూల పోలీసు అధికారులే కారణం’’ అని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని