Congress: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

Updated : 31 Mar 2024 13:01 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల కడియం కావ్యకు భారాస వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ ఆమె నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఆమె తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా త్వరలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరడం గులాబీ పార్టీకి పెద్ద షాకే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కడియం కీలక నేత. తెదేపా హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత భారాసలో చేరి ఆ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగానూ సేవలందించారు. కుమార్తెకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చినా భారాసను వీడటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాం తదితర అంశాలు భారాస ప్రతిష్ఠను దిగజార్చాయని పేర్కొంటూ లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి కావ్య తప్పుకొన్నారు. 

జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని.. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్యను కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆ పార్టీలోకి ఆహ్వానించడం.. నేడు చేరిపోవడం జరిగిపోయాయి. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలా జరగనిపక్షంలో కడియం శ్రీహరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు