Bengaluru: బియ్యంపై రాజకీయ కయ్యం.. మరి FCI ఎందుకలా చెప్పిందన్న సీఎం!

కర్ణాటకలో బియ్యం పంపిణీపై భాజపా, కాంగ్రెస్‌ మధ్య వార్‌ తారస్థాయిలో కొనసాగుతోంది. ఇరు పార్టీలూ మంగళవారం పోటీపోటీ నిరసనలు చేపట్టాయి. 

Updated : 20 Jun 2023 15:59 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో ఉచిత బియ్యం పంపిణీ విషయంలో అధికార కాంగ్రెస్‌(Congress), ప్రతిపక్ష భాజపా(BJP) మధ్య పొలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది.  అన్నభాగ్య పథకం(Anna Bhagya scheme) అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. ఈ పథకం అమలు చేయడంలో సిద్ధూ సర్కార్‌ విఫలమైందంటూ భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇరు పార్టీల శ్రేణులూ పోటా పోటీ నిరసనలు చేపట్టాయి. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టగా.. మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై సహా భాజపా నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగారు.  భాజపా నేతలను పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 10కిలోల బియ్యం ఇవ్వడంలో వైఫల్యం చెందిందంటూ విమర్శించగా.. అన్నభాగ్య పథకాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుస్తుందని డీకేఎస్‌ తేల్చి చెప్పారు. భాజపా పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఎఫ్‌సీఐ అప్పుడు ఎందుకలా చెప్పింది: సీఎం సిద్ధూ

ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరుపై మండిపడ్డారు.  ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (FCI) గతంలో కర్ణాటకకు బియ్యం సరఫరా చేస్తామని చెప్పిందన్నారు. కానీ, ఆ తర్వాత  బియ్యం, గోధుమలు సరఫరా చేయలేమంటూ జూన్‌ 14న తమకు ఎఫ్‌సీఐ మరో లేఖ పంపినట్టు పేర్కొన్నారు. ‘‘దీనర్థం ఏంటి?  ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు లేనప్పుడు మరి ముందు ఎందుకు అంగీకరించారు? వారు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు. ఇది పేదలకు వ్యతిరేకం’’ అంటూ మండిపడ్డారు. 

రాజకీయం చేయొద్దు.. కేంద్రానికి డీకే విజ్ఞప్తి

‘‘బియ్యం కొనుగోలు విషయంపై పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఇతర పొరుగు రాష్ట్రాలతో మాట్లాడాం. ఆ రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలుచేస్తున్నాం. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం తన సొంత బియ్యం ఏమీ ఇవ్వడంలేదు కదా. మేం ఎవరినీ ఉచితంగా  అడగడంలేదు. కర్ణాటకకు అవసరమైన ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే సామర్థ్యం మాకు ఉంది’’ అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని