TDP: రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని

గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు.

Updated : 17 Apr 2024 13:40 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు.. తెదేపా కేడర్‌ను అక్రమ కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అమాయకులైన బీసీ యువకుల్ని కొట్టి, బెదిరించి వారితో బొండా ఉమా పేరు చెప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి కేసులో దళిత యువకుడు శ్రీనివాస్‌ను తన రాజకీయ కుట్రకు పావులా జగన్‌ వాడుకున్నారని విమర్శించారు. గులకరాయి డ్రామాలో వడ్డెర కులానికి చెందిన వారి జీవితాలు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 

జగన్‌పై రాళ్ల దాడి కేసులో కుట్ర జరుగుతోందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. తెదేపా నేతలను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. ఇది డ్రామా అని ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. వైకాపా ఇప్పటికైనా డ్రామాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో  ఆ పార్టీకి ఓటమి తప్పదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని