Lok Sabha elections: ‘మా మద్దతు ఇండియా కూటమికే’.. ఎన్డీయేలోని ఎల్‌జేపీకి షాక్‌!

Lok Sabha elections: బిహార్‌లో చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది సీనియర్‌ నేతలు పార్టీని వీడారు. సీట్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Published : 04 Apr 2024 08:17 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే (NDA) భాగస్వామ్యపక్షమైన లోక్‌జన శక్తి పార్టీ (రామ్‌ విలాస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) నేతృత్వంలోని ఈ పార్టీకి 22 మంది సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. వీరిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్‌ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్‌, రవీంద్ర సింగ్‌ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరంతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజు తివారీకి రాజీనామా లేఖలు సమర్పించారు. ఇకపై విపక్ష కూటమి ‘ఇండియా’కు (INDIA Bloc) మద్దతుగా నిలవబోతున్నట్లు ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సీట్లను అమ్ముకుంటోందని రాజీనామా చేసిన నేతలు ఆరోపించారు. సమస్తీపుర్‌, ఖగడియా, వైశాలి లోక్‌సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారు. చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan), ఆయన సన్నిహితులే స్వయంగా సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. అభ్యర్థులను ఖరారు చేసే ముందు పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన నాయకులపై పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.

ఈశాన్యంలో ‘హిందుత్వ’పై మౌనం

‘‘బయట నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీకోసం పనిచేస్తున్న నేతలకు టికెట్లు ఇవ్వాలి. బయటి వారికి ఇస్తున్నారంటే పార్టీలో సమర్థులు లేరనే అర్థం. పార్టీ కోసం పనిచేసి మిమ్మల్ని నాయకులను చేయడానికి మేమైనా కార్మికులమా? బయటివారికి టికెట్లు కేటాయించి పార్టీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రశ్నించారు. ‘నూతన బిహార్‌’ కల సాకారం కోసం చేస్తున్న కృషిని విస్మరించారు. ఇక దేశాన్ని రక్షించాలంటే ‘ఇండియా’ కూటమికి అండగా నిలవాల్సిందే. మేమంతా విపక్ష కూటమికి మద్దతునివ్వబోతున్నాం’’ అని కుశ్వాహా అన్నారు.

ఎన్డీయే (NDA)తో సీట్ల పంపకాల్లో భాగంగా ఎల్‌జేపీకి ఐదు స్థానాలు కేటాయించారు. వాటిలో హాజీపూర్‌, వైశాలి, ఖగడియా, సమస్తీపూర్‌, జముయీ ఉన్నాయి. హాజీపూర్‌ నుంచి చిరాగ్‌ పోటీ చేస్తుండగా.. ఆయన సమీప బంధువు అరుణ్‌ భారతీ జముయీ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని