Kharge: మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్‌ చేశారు.

Published : 18 May 2024 20:28 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) శనివారం ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (EC) చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘మేం ఇప్పటివరకు బుల్డోజర్లు వాడలేదు.. ప్రజలను  రెచ్చగొట్టే ప్రసంగాలు  చేస్తున్న ప్రధానిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తాం. రాజ్యాంగాన్ని అనుసరిస్తాం” అని ఖర్గే అన్నారు.

ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలతో కలిసి ఖర్గే ముంబయిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రలోని అసలైన పార్టీలకు కాకుండా భాజపాకు మద్దతిచ్చే వర్గాలకు పార్టీ గుర్తులను మంజూరుచేయాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తంచేశారు. ద్రోహం, కుట్రలతో మహారాష్ట్రలోని ‘మహాయుతి’(శివసేన-శిందే వర్గం,ఎన్సీపీ- అజిత్‌ పవార్‌) ప్రభుత్వం ఏర్పడిందని, దానికి ప్రధానమంత్రి స్వయంగా మద్దతిస్తున్నారని ఖర్గే అన్నారు. మోదీ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అప్పటికే ఉన్న పార్టీల గుర్తులను తీసేసి భాజపాకు మద్దతిచ్చే పార్టీలకు ఆ గుర్తులు ఇవ్వాలని కోర్టు, ఈసీ నిర్ణయం తీసుకున్నాయని, అంతా మోదీ ఆదేశాల మేరకే జరుగుతుందని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు.

 రాష్ట్రంలోని 48 స్థానాలకు గానూ 46 స్థానాల్లో కూటమి భారీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ప్రజలే స్వయంగా చెబుతున్నారని ఖర్గే తెలిపారు. ఆమ్ ఆద్మీ(ఆప్‌) పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు గురించి మాట్లాడుతూ రెండు పార్టీలు దిల్లీలో భాజపాకు వ్యతిరేకంగా పోరాడతాయి. పంజాబ్‌లో ఒక దానితో ఒకటి పోటీపడతాయి అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, నిరంకుశత్వానికి చోటు లేదని ఆయన అన్నారు. భాజపాను ఓడించేందుకు ఏం చేయాలో అది చేస్తామని ఖర్గే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని