Kishan Reddy: అందలమెక్కించిన అంకితభావం

ఠోర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది.

Published : 10 Jun 2024 05:41 IST

 కిషన్‌రెడ్డిని రెండోసారి వరించిన కేంద్రమంత్రి పదవి

ఈనాడు, హైదరాబాద్‌: కఠోర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. 

 రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలు 

1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి 1982లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు. 1986 నుంచి ఐదేళ్లపాటు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 2004 వరకు బీజేవైఎం రాష్ట్ర, జాతీయ కార్యవర్గాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో తొలిసారి హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లలో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 నుంచి 2018 వరకు భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2023 జులైలో మరోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు.. నేషనల్‌ యూత్‌ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవకు గాను యునిసెఫ్‌ ‘ఛైల్డ్‌ ఫ్రెండ్లీ లెజిస్లేటర్‌’ గౌరవాన్ని పొందారు. 

 తెలుగురాష్ట్రాల అభివృద్ధికి  అంకితభావంతో పనిచేస్తాం: జి.కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో గల్లీలో పనిచేసిన ముగ్గురు కార్యకర్తలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత భాజపాకు మాత్రమే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ రెండో ప్రభుత్వంలో పనిచేసిన ఆయన ఇప్పుడు మూడో ప్రభుత్వంలోనూ క్యాబినెట్‌ మంత్రిగా ఆదివారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపాలో పనిచేసిన వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరికి మంత్రిపదవులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు పార్టీ మంత్రి పదవులు కట్టబెట్టింది. గల్లీలో పనిచేసిన కార్యకర్తలను దిల్లీలో మంత్రులుగా చేసిన చరిత్ర భాజపాకు తప్ప దేశంలో మరే రాజకీయపార్టీకి లేదు. మాకెవ్వరికీ రాజకీయ వారసత్వం లేదు. పెద్దనాయకులెవ్వరితోనూ బంధుత్వంలేదు. అయినా సిద్ధాంతమే మాకు ఊపిరి. పార్టీ కార్యకర్తలే కుటుంబం అని మమ్మల్ని ఎంపిక చేశారు. గత పదేళ్లు ఎలా పనిచేశామో వచ్చే 5 ఏళ్లు అలాగే పనిచేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా అమలుచేస్తాం. తెలుగురాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం. పార్టీ కార్యకర్తలు మరింత పట్టుదలతో భాజపాను దక్షిణాదిలో విస్తరించేందుకు ముందుండాలని పిలుపునిస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణలో భాజాపాకు 8 లోక్‌సభ స్థానాలు, 35% ఓట్లు ఎన్నడూ రాలేదు. తెలంగాణ ప్రజలు మోదీపైన, పార్టీపైనా విశ్వాసంతో ఆశీర్వదించారు. గత శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిపించారు. ఇకముందు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 స్థానాల్లో గెలవాలనేదే లక్ష్యం. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భాజపాను అధికారంలోకి తేవడానికి అందరూ పనిచేయాలి. నాకు ఇంతటి విజయాన్ని చేకూర్చిపెట్టిన సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

పేరు: గంగాపురం కిషన్‌రెడ్డి

పుట్టిన తేదీ: 15-6-1960 

తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళ్లమ్మ 

భార్య: కావ్యారెడ్డి (గృహిణి)

పిల్లలు: వైష్ణవి, తన్మయ్‌ (ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని