Kishan Reddy: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తి భాజపాయే

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందనేందుకు లోక్‌సభ ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Jun 2024 04:11 IST

భారాసను వద్దనుకునే ప్రజలు కమల దళాన్ని బలపర్చారు
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పోటీ చేసింది
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని వెల్లడి

ఓయూలోని కౌంటింగ్‌ కేంద్రం ఆవరణలో కుమార్తె వైష్ణవి, కుమారుడు తన్మయ్‌లతో
కలిసి గెలుపు ధ్రువీకరణపత్రాన్ని చూపుతున్న కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్, బర్కత్‌పుర, సికింద్రాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందనేందుకు లోక్‌సభ ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటింగ్‌ సరళిని బట్టి చూస్తే.. తెలంగాణలో భారాసను వద్దనుకుంటున్న ప్రజలు మోదీ నాయకత్వంలో భాజపా బలపడాలని కోరుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో  పార్టీకి 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ఓట్లు పెరిగాయని, ఖమ్మం లాంటి నియోజకవర్గంలోనూ లక్షకు పైగా ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పార్టీ ప్రధాన పోటీగా నిలిచి భాజపాను ఓడించాలని ప్రయత్నించి విఫలమైందని ఆక్షేపించారు. తెలంగాణ భాజపా పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌పటేల్‌తో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలు తొలిసారిగా భాజపాకు సొంతంగా అత్యధిక స్థానాలను కట్టబెట్టారు. మోదీ నాయకత్వంపై విశ్వాసంతోనే అది సాధ్యమైంది. మేం గెలుపొందని స్థానాల్లోనూ ఓటింగ్‌ శాతాన్ని పెంచుకున్నాం. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ప్రజలను మభ్యపెట్టేవే తప్ప, ఆచరణ సాధ్యమైనవి కావని ప్రజలు గుర్తించారు. 

తప్పుడు ప్రచారాన్ని నమ్మలేదు

కాంగ్రెస్‌ పార్టీ ఫేక్‌వీడియోలు తయారుచేయడంతోపాటు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్, భారాసలు తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు. పైగా దేవుళ్ల మీద ఒట్లు వేసి కాలం గడుపుతున్నట్లు అర్థం చేసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ ఆర్నెల్ల పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారు. అందుకే వారికి భాజపా ప్రత్యామ్నాయంగా కనిపించింది. కాంగ్రెస్‌కు 50 శాతం సీట్లు కూడా రాలేదు. ఈ ఫలితాలను ఏరకంగా రెఫరండంగా తీసుకుంటారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాలి. 

భారాస తుడిచిపెట్టుకుపోయింది

ఆర్నెల్ల క్రితం వరకు రాష్ట్రాన్ని పాలించిన భారాస ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారాస కంచుకోట మెదక్‌ను బద్దలుకొట్టి జెండా ఎగరేశాం. తెలంగాణ ప్రజలు పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చినందున...రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తాం. భవిష్యత్తులో మరింత బలాన్ని పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలోకి వచ్చామన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు సీట్లు తగ్గడంపై జాతీయ పార్టీలో విశ్లేషించుకుంటామన్నారు. అంతకుమునుపు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి, ఆర్‌వో నుంచి ధ్రువీకరణ పత్రం స్వీకరించిన తర్వాత కిషన్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలపక్షాన పోరాడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని