AP news: కొడాలి నాని వర్గీయులకు ఝలక్‌

గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు ఆక్రమించుకున్న సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని సంబంధిత యజమానులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 09 Jun 2024 05:19 IST

ఆక్రమించిన 7.66 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్న యజమానులు

పొక్లెయిన్‌తో కంచె తొలగిస్తూ.. 

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు ఆక్రమించుకున్న సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని సంబంధిత యజమానులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధించడంతో చైతన్య సహకార సంఘం ప్లాట్ల యజమానుల్లో ధైర్యం వచ్చింది. 7.66 ఎకరాల్లో వేసిన 60 మందికి చెందిన ప్లాట్లను కరోనా సమయంలో వైకాపా నాయకులు ఆక్రమించారు. అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కొందరు రౌడీలతో స్థలం చూడడానికి వెళ్లిన వారిపై దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లగా తీర్పులు ఇచ్చినా స్థలం ఖాళీ చేయడం లేదు. నాని వర్గీయులకు భయపడి అధికారులు కూడా బాధితుల ఫిర్యాదులకు స్పందించలేదు. బాధితుల్లో 18 మంది హైకోర్టుకు వెళ్లారు. వారిలో కొందరు మేం వైకాపావాళ్లమేనని.. మా స్థలం ఇప్పించాలని నాని వద్దకు వెళ్లారు. 20 ఏళ్ల క్రితం రేటుకు కొంటాం.. ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే వెళ్లిపోండని సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు. అయిదుగురు బాధితులు గుడివాడ సివిల్‌ కోర్టును ఆశ్రయించగా సూరపనేని బాలకిరణ్‌బాబుకు స్థలం అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇతరులకు కూడా తీర్పు అనుకూలంగా వస్తుందని ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో బాధితులు ధైర్యం చేసి, శనివారం ఆక్రమిత స్థలంలోని కంచెను జేసీబీలతో తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని