Kodandaram: కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?: కోదండరాం

భారాస వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు.

Updated : 01 Mar 2024 15:30 IST

హైదరాబాద్‌: భారాస వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పటిష్ఠంగా ఉందనడం విడ్డూరమన్నారు. 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని భారాస వితండవాదం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులపై జరిగిన తప్పిదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలి. ఊరూరా తిరిగి భారాస బండారం బట్టబయలు చేస్తాం. కాళేశ్వరం కామధేనువు ఎలా అవుతుందో కేసీఆర్‌ చెప్పాలి. ఆ ప్రాజెక్టు మూడు రకాల సంక్షోభాలకు కారణమైంది. సాగునీరు, ఇంజినీర్‌ వ్యవస్థ, నిధుల సంక్షోభానికి గురైంది’ అని విమర్శించారు. 

తన స్వప్రయోజనాల కోసమే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు చేపట్టారని కోదండరాం ఆరోపించారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా డిజైన్లు మార్చారని.. వాటికి కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదన్నారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని సీడబ్ల్యూసీ చెప్పిందని గుర్తుచేశారు. ఆ హెచ్చరికను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. పంప్‌హౌస్‌లు మునుగుతాయని చెప్పినా పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని