Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

గన్‌మెన్లను తొలగించడంపై వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే అలా జరగదన్నారు. ఇకపై ఒంటరిగా తిరుగుతానని.. భయపడేదే లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated : 05 Feb 2023 13:38 IST

నెల్లూరు: తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి ఉన్న గన్‌మెన్లను తొలగిస్తారా? అని వైకాపా (YSRCP) తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో ఈ పనిచేశారో తెలియదని.. కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఇలా జరగదన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను మానసికంగా హింసించేందుకే గన్‌మెన్లను తొలగించారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నాకు ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను ఇచ్చింది. శనివారం ఇద్దరిని వాపసు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే అలా జరగదు. నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాకు అదనపు భద్రత కల్పించాలి. రక్షణ ఇవ్వాల్సింది పోయి ఉన్నవాళ్లని తొలగిస్తారా?నా ఇద్దరు గన్‌మెన్లను గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా. మిగిలిన ఇద్దరు గన్‌మెన్లనూ మీకే గిఫ్ట్‌గా  ఇస్తున్నా.. తీసుకోండి. ఇకపై ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతా.. ఏం భయపడను. గన్‌మెన్‌లు చాలా బాధతో వెనక్కి వెళ్లారు.. వారికి అండగా ఉంటా. మానసికంగా బలహీనపడను.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తా. నా గొంతు ఇంకా పెరుగుతుంది.. తగ్గేదే లే.  నా భద్రత పర్యవేక్షించే పోలీసులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే పదింతల వేధింపులు నాకుంటాయి. నా ఖర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని