KTR: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర: కేటీఆర్‌

ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు.

Published : 01 Mar 2024 09:57 IST

హైదరాబాద్‌: భారాస నేతలు తెలంగాణ భవన్‌ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. కేసీఆర్‌ మినహా మిగతా ముఖ్య నేతలంతా తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. ‘తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి’ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైందని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్‌ నిర్మించారని కొనియాడారు. రాష్ట్రంలో కరవు లేకుండా చేసేందుకే కాళేశ్వరం నిర్మించారని తెలిపారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏదో జరిగినట్లు.. లేనిది ఉన్నట్టు చూపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో 3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ.. రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసేందుకు మేడిగడ్డను వాడుకుంటున్నారు’ అని పోచారం విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని