KTR: ధాన్యం బోనస్‌ను బోగస్‌గా మార్చిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి

ధాన్యం బోనస్‌ హామీని బోగస్‌గా మార్చిన కాంగ్రెస్‌ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Published : 25 May 2024 05:05 IST

మాజీ మంత్రి కేటీఆర్‌

నకిరేకల్‌లో నిర్వహించిన భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌..
వేదికపై చిరుమర్తి లింగయ్య, జగదీశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, గాదరి కిశోర్‌

ఈనాడు, నల్గొండ- నకిరేకల్, చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ధాన్యం బోనస్‌ హామీని బోగస్‌గా మార్చిన కాంగ్రెస్‌ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆరు నెలల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్, చౌటుప్పల్, దేవరకొండలో నిర్వహించిన భారాస సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్‌ అని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కేవలం 10 శాతం మంది రైతులు పండించే సన్నాలకే బోనస్‌ అంటూ అన్నదాతలను మోసం చేస్తోందని విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలోకి వచ్చాక రుణమాఫీపైనే తొలి సంతకం అన్న రేవంత్‌.. సీఎం పీఠమెక్కిన తర్వాత మాట మార్చారు. ఆయన రైతు బిడ్డ కాదు. స్థిరాస్తి వ్యాపారి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఆ ప్రభుత్వానికి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్‌ మోసాలు, హామీల అమలుపై చట్టసభలో నిలదీస్తారు. సెల్‌ఫోన్‌ లైట్ల సాయంతో ప్రభుత్వ వైద్యశాలల్లో శస్త్రచికిత్సలు చేసే దుస్థితికి రాష్ట్రం వచ్చేసిందంటే కాంగ్రెస్‌ పాలన ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయకుండా సీఎం రేవంత్‌ 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని దొంగమాటలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం పోటీ చేసినపుడు డబ్బులు లేవన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నేడు రూ.2.50 కోట్ల విలువైన కారులో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్, నల్గొండ జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని