KTR: భాజపాను కట్టడి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు: కేటీఆర్‌

భాజపాను కట్టడి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Updated : 26 Mar 2024 16:15 IST

హైదరాబాద్‌: భారాస పాలనలో హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటేనంటూ అసత్య ప్రచారం చేసి, మైనార్టీ సోదరులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దిల్లీ మద్యం కేసులో ఆధారాలుంటే కిషన్‌రెడ్డి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘ఎన్నికల బరిలో భాజపా అభ్యర్థులు మినహా ఇతరులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల నాయకులను కేంద్రం అరెస్టు చేయిస్తోంది. భాజపాను కట్టడి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఎన్నికల ముందు భాజపాకు భారాస బీ టీం అని,  కవితను అందుకే అరెస్టు చేయలేదంటూ కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌ ప్రజలు నమ్మలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులు విజయం సాధించారు. దిల్లీలో మోదీని చౌకీదార్‌ చోర్‌ హై అంటూ రాహుల్‌ గాంధీ విమర్శిస్తుంటే.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ బడేభాయ్‌ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమమని, లిక్కర్‌ పాలసీ కేసు నకిలీదని దిల్లీలో కాంగ్రెస్‌ విమర్శలు చేస్తుంటే.. తెలంగాణలో కవితను అరెస్టు చేయాలని సీఎం అంటారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మధ్య సరైన అవగాహన లేదనేందుకు ఇదే నిదర్శనం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. అవకాశవాద రాజకీయాల కోసం దానం నాగేందర్‌ పార్టీ మారారు. ఆయనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని