KTR: ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే.. ఆ ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్‌

పదేళ్లలో కేసీఆర్‌ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్‌ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. 

Published : 25 May 2024 15:36 IST

హైదరాబాద్‌: పదేళ్లలో కేసీఆర్‌ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్‌ హయాంలో కొత్తగా ఒరిగిందేమీ లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏవైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అటెండర్‌ మొదలు గ్రూప్‌-1 ఉద్యోగాల వరకు 95శాతం స్థానికులకే సాధించిన ఘనత కేసీఆర్‌ది మాత్రమే అన్న ఆయన.. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్‌ అడ్డుపడ్డారని గుర్తు చేశారు. 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ ఆక్షేపించారు. 

కేసీఆర్‌ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్‌రెడ్డి రాజకీయ దివాళాకోరుతనంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ పదేళ్లలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లలో ఏడాదికి 19వేల ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో అయినా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్‌, భాజపాలకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని