Kumara swamy: సిద్ధరామయ్య సర్కార్‌ భవిష్యత్తుపై ‘కుమార’ ఆసక్తికర వ్యాఖ్యలు!

కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం భవిష్యత్తు వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని జేడీఎస్‌ నేత కుమారస్వామి వ్యాఖ్యానించారు.

Published : 26 May 2023 01:39 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో కొత్తగా కొలువుదీరిన సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ(Congress Government) భవిష్యత్తుపై  మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌.డి.కుమారస్వామి(Kumaraswamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీర్ఘకాలం పాటు సాగే అంశంపై సందేహాలు వ్యక్తం చేసిన ఆయన..  2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే  అక్కడి సర్కార్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తాను చేసిన విశ్లేషణ ఆధారంగానే ఈ మాటలు చెబుతున్నానన్నారు. అంతేగానీ,  ఎవరితోనో చేతులు కలిపి అంటున్నట్టుగా ఎవరూ తప్పుగా భావించవద్దని కోరారు. గురువారం బెంగళూరులో జేడీఎస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితం కావడంపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో తనకు తెలియదన్న కుమార..  ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని తనకు అనిపిస్తోందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే ఈ ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తనకు తెలుసన్నారు.  తాను ఏ విషయాలూ దాచి మాట్లాడట్లేదని.. అలాగని జోస్యం కూడా చెప్పడంలేదన్నారు. 

‘‘నేను రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషణ మాత్రమే చేస్తున్నా.. అంతే.  నేనేమీ జోస్యం చెప్పడంలేదు. ఎవరితోనో చేతులు కలిపి నేనేదో చేయాలని ప్రణాళిక చేస్తున్నాననే సందేహాలు మీడియా మిత్రులకు వద్దు. ఇది కేవలం నా ఊహ మాత్రమే.. ఎందుకంటే ఎలాంటి పరిణామాలు జరగవచ్చో మనకు తెలియదు కదా!  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు హామీల అమలు చేసే తీరునుగమనిస్తాం.  ఆ ఐదు హామీల వల్లే కాంగ్రెస్‌కు జనం ఓట్లు వేసి అధికారం ఇచ్చారు. వాటి వల్లే మా పార్టీ ఉనికికి నష్టం జరిగింది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలి.. ఏవైనా షరతుల పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు’’ అని వ్యాఖ్యానించారు.

తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కుమారస్వామి.. పార్టీని ముందుకు నడిపించేందుకు శ్రమించే వారికే అవకాశాలు కల్పిస్తామన్నారు. జేడీఎస్‌ పార్టీ కుటుంబ పార్టీ అనే ముద్రను చెరిపివేయాలనుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో జరగబోయే బృహత్‌ మహానగర పాలిక (బీబీఎం), జిల్లా, తాలుకా పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో   కాంగ్రెస్‌  ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనా లేదా ఆ హామీలను అమలు చేసేందుకు షరతులు పెట్టినా  అవి రాబోయే రోజుల్లో జేడీఎస్‌కు ప్రధాన ఆయుధాలుగా మారతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు