LokSabha Elections: ‘ఐసీఈ’ వల్లే వారంతా భాజపాలో చేరుతున్నారు: సుప్రియా సూలే

LokSabha Elections: ఈసారి మహారాష్ట్రలోని బారామతిలో ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం ఉంది. సిటింగ్‌  ఎంపీ సుప్రియా సూలేపై ఆమె సోదరుడు అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రియా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 Mar 2024 17:25 IST

ముంబయి: దేశవ్యాప్తంగా భాజపాలో చేరుతున్న నేతలు ఆ పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడి వెళ్లడం లేదని ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) అన్నారు. కేవలం ‘ఐసీఈ- ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, సీబీఐ, ఈడీ’ వల్లే వారంతా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని ఆరోపించారు. 2009 నుంచి మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు.

ఈసారి బారామతిలో ఆసక్తికర పోటీ నెలకొననుందని తెలుస్తోంది. ఎన్సీపీ (NCP) నుంచి అజిత్‌ పవార్‌ విడిపోయి భాజపా, శివసేన శిందే వర్గంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. ఈసారి బారామతి నుంచి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ను బరిలోకి దింపే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వదిన-మరదళ్లు సుప్రియా, సునేత్ర మధ్య పోటీ ఉండనుందని సమాచారం. అయితే, తనపై ఎవరు పోటీ చేస్తున్నారో ఇప్పటి వరకు తెలియదని సుప్రియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి గెలుపు అవకాశాలపై సుప్రియా (Supriya Sule) స్పందించారు. ‘‘భాజపాలో చేరుతున్నవారు ఆ పార్టీపై ఇష్టంతో వెళ్లడంలేదు. కేవలం ఐసీఈ- ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, సీబీఐ, ఈడీ వల్లే చేరుతున్నారు. ఒకప్పుడు అశోక్‌ చవాన్‌పై భాజపా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడు ఆయన్ని వారి పార్టీలో చేర్చుకున్నారు. ఇలా వారు పార్టీలను చీల్చుతున్నారు. ఇది రాజకీయం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం’’ అని సుప్రియా మండిపడ్డారు. బారామతిలో చేసిన అభివృద్ధి పనులే ఈసారి తనని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్‌ చవాన్‌ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని