Election results: తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Election results: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Updated : 04 Jun 2024 08:15 IST

Election results | దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8.30 గంటల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు.

మరికొన్ని గంటల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? అనేది తేలిపోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంటుందా? లేక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ విపక్ష ఇండియా కూటమి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందా? అనే దానిపై ప్రజా తీర్పు వెలువడనుంది. ఏపీలో 175 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. వైకాపా ఒంటరిగా బరిలో నిలిచింది. ఈ రెండు పక్షాల్లో ప్రజల ఆశీర్వాదం ఎవరికి? అనేది వెల్లడి కానుంది. 

దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఎన్నికల సంఘం (EC) ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. పార్టీ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించింది. దేశంలో 96.88 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. 31.2 కోట్ల మంది మహిళలు సహా 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలు

గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఈ దఫా అది ఎంతవరకు మెరుగైన ఫలితాలను సాధిస్తుందో చూడాల్సి ఉంది. వామపక్షాలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు దక్కకపోతే దేశవ్యాప్తంగా వాటి మనుగడ మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీపీ, శివసేన పార్టీల్లో చీలికల కారణంగా శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రేల రాజకీయ భవిష్యత్‌ గమనాన్నీ ఈ ఎన్నికలే నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లకూ ఈ ఎన్నికలు కీలకమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని