BJP: రాశి.. వాసితో కమల వికాసం

రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది.

Published : 05 Jun 2024 06:47 IST

లోక్‌సభ ఎన్నికల్లో 35.08 శాతం ఓట్లతో 8 చోట్ల విజయం... 7 స్థానాల్లో రెండో స్థానం
పదేళ్లలో బలమైన స్థితికి భాజపా
ఎన్నిక... ఎన్నికకు బలోపేతమవుతున్న పార్టీ
ఈనాడు, హైదరాబాద్‌

కరీంనగర్‌లో విజయం సాధించిన అనంతరం భాజపా నిర్వహించిన ర్యాలీలో అభ్యర్థి బండి సంజయ్‌ను ఎత్తుకుని ఊరేగిస్తున్న కార్యకర్తలు

రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ భాజపా బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. పదేళ్లలో పార్టీ రాష్ట్రంలో ఓట్లను... సీట్లను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి ఎనిమిది చోట్ల నెగ్గి.. మరో ఏడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది.

విజయం సాధించిన స్థానాలు: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్‌  

రెండో స్థానంలో నిలిచినవి : పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌.

కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌తో సమానంగా భాజపా లోక్‌సభ సీట్లను గెలుచుకోగా భారాస అత్యధిక స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తక్కువ ఓట్లను పొందుతున్నా లోక్‌సభ ఎన్నికలో మాత్రం అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లతో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో గెలిచిన భాజపా ఈ సారి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని ఏకంగా 35.08 శాతానికి, సీట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. కాంగ్రెస్‌కు 40.1 శాతం, భారాసకు 16.68 శాతం ఓట్లు వచ్చాయి. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 13.9 శాతం ఓట్లతో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలవకున్నా...

2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా భాజపా గెలవకున్నా తాజా ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. కరీంనగర్, సికింద్రాబాద్‌ మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లోని 42 అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట కూడా విజయం సాధించకున్నా తాజా ఎన్నికల్లో ఈ ఆరు లోక్‌సభ స్థానాలను భాజపా సొంతం చేసుకుంది. ప్రతి లోక్‌సభ స్థానంలో పార్టీ ఓట్లను గణనీయంగా పెంచుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలోని సెగ్మెంట్లలో వచ్చిన ఓట్లకు తాజాగా వచ్చిన వాటికి మధ్య భారీ పెరుగుదల ఉంది. 

ఫలించిన ‘మరోసారి మోదీ’ నినాదం

పకడ్బందీ కార్యాచరణ... పక్కా ప్రణాళిక... ముందస్తు వ్యూహం... అభ్యర్థుల ఎంపిక... జాతీయ నేతల విస్తృత ప్రచారం... ‘మరోసారి మోదీ’ నినాదం.. క్షేత్రస్థాయిలో అమలు చేసిన సూక్ష్మ ప్రణాళిక లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సత్తా చాటేందుకు భాజపాకు ఉపకరించాయి. ఎనిమిది లోక్‌సభ స్థానాలను దక్కించుకునేందుకు బాటలు వేశాయి. పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర పార్టీకి నిర్దేశించడం.. రాష్ట్ర నాయకత్వం దానిని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కలిసొచ్చింది. రెండంకెల స్థానాలు లక్ష్యంగా బరిలో దిగిన పార్టీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. భాజపా, అనుబంధ విభాగాలు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చినట్లు పార్టీ విశ్లేషిస్తోంది.  

బలమైన అభ్యర్థులను బరిలో దింపడమే లక్ష్యంగా...

భాజపాలోని బలమైన నేతలతో పాటు కొత్త నేతలకు పార్టీ టికెట్లలో ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీలో కీలక నేతలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్, డి.అర్వింద్, రఘునందన్‌రావులను అభ్యర్థులుగా బరిలో దింపింది. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దాన్ని ఎన్నికల నినాదంగా మార్చింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసింది. ఎప్పటికప్పుడు సర్వేలు, అంచనాలతో అంతర్గత పరిస్థితులను గుర్తించి దానికి అనుగుణంగా ప్రణాళిక అమలు చేసింది. బహుముఖ కార్యాచరణ పార్టీకి ఉపకరించినట్లు భాజపా నేతలు విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని