Mahabubnagar: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 11 మందిపై కేసు నమోదు

ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 11 మందిపై మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 11 Aug 2023 21:36 IST

మహబూబ్‌నగర్‌: ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 11 మందిపై మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ రెండో పట్టణ పీఎస్‌లో 11 మందిపై కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్‌ గౌడ్‌, పలువురు ఎన్నికల అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. గతంలో పిటిషన్‌పై విచారణ చేసిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.. శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు అధికారులపై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్‌ పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని.. వారిపై మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి విచారణ చేసింది.

వాదనలు విన్న ధర్మాసనం.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేశారా? లేదా? ఒకవేళ నమోదు చేసి ఉంటే ఎఫ్‌ఐఆర్‌ సహా పూర్తి వివరాలు ఇవాళ సాయంత్రంలోగా కోర్టుకు సమర్పించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకపోతే దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు